క్రేజ్ ఉన్న సినీ స్టార్స్ చేత పలు సంస్థలు తమ ఉత్పత్తులను ప్రచారం చేయిస్తుంటారు. ఆ ప్రచారం చూసి చాలామంది వాటిని కొనుగోలు చేయడం..వాడడం చేస్తుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆమ్ వే అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.
దీన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తప్పుబట్టారు. గొలుసుకట్టు సంస్థలకు ప్రముఖులు ఎవరూ ప్రచారం చేయొద్దంటూ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. సజ్జనార్ తన వృత్తితో పాటు సామాజిక అంశాలపై స్పందిస్తుంటారు..ఈ మేరకు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు.
ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దేశ ఆర్ధిక వ్యవస్థను, సమాజంలోని సామాజిక వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి ఫేక్ సంస్ధలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దని అభ్యర్ధించారు.
సెలబ్రెటీలు ఎవరూ ఇలా చేయవద్దని సూచించారు. అమితాబ్ లాంటి స్టార్ నటులు ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం సరికాదని సజ్జనార్ సూచించారు. ఈ మేరకు ఆమ్వే సంస్ధలకు సహకరించవద్దని ట్విట్టర్లో అమితాబ్ బచ్చన్‌కు ట్యాగ్ చేసి సజ్జనార్ కోరారు.
‘‘’గొలుసుకట్టు సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. అమాయక ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నాయి. ఇలాంటి సంస్థలను సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం కానీ.. వాటికి మద్దతు ఇవ్వడం కానీ చేయొద్దు’’’ అని సజ్జనార్ సలహా ఇచ్చారు.
దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అమితాబ్ బచ్చన్‌కు ట్విట్టర్లో రిక్వెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి సజ్జనార్ రిక్వెస్ట్ ఫై బిగ్ బి ఏమైనా స్పందిస్తారా.. ? అనేది చూడాలి.
సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన సజ్జనార్ గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సిఐడిలో ఆర్ధిక నేరాల విభాగంలో పనిచేస్తున్నప్పుడు ఆమ్వే అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేశారు. అందులో భాగస్వామ్యమైన పలువురు కీలక రాజకీయనేతల బండారాన్ని కూడా బయటపెట్టారు. అయితే రాజకీయ వత్తిడులతో ఆయనను ఆ పోస్ట్ నుండి బదిలీ చేయించడంతో, ఆ కేసు కూడా నీరుగారిపోయింది.