చెనైలోని ప్రతిష్టాత్మక సంస్థ కళాక్షేత్రంలోని విద్యార్థినీలు అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా నిరసనలు చేస్తున్నారు. కళాక్షేత్రంలోని ఓ అసిస్టెంట్ ప్రొఫెర్, మరో ముగ్గురు ఆర్టిస్టులు లైంగిక వేధింపులకు, బాడీ షేమింగ్, వర్ణ వివక్షకు గురిచేస్తున్నారని పూర్వ విద్యార్థి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ వెలుపుల దాదాపు 200 మంది విద్యార్థినీలు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు.
ఈ క్రమంలో లైంగిక వేధింపులకు గురిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ హరిపద్మన్‌పై ఓ మాజీ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. హరి పద్మన్‌కు వ్యతిరేకంగా ఇవాళ సుమారు రెండు వందల మంది స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. ఆ ప్రొఫెసర్‌ను తమను లైంగికంగా వేధిస్తన్నారని, దుర్భాషలాడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు.
కాగా, శుక్రవారం 90 మంది విద్యార్థులు రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్‌కు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేఖ రాశారు. ఈ విషయంపై స్టాలిన్ స్పందిస్తూ లైంగిక వేధింపులకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విద్యార్థినీలకు హామీ ఇచ్చారు.
అలాగే కళాక్షేత్ర విద్యార్థినీలు గురువారం కేంద్ర సాంస్కృతిక శాఖామంత్రి కిషన్‌రెడ్డికి, స్టాలిన్‌కి లేఖ రాశారు. ఈ లేఖలో తాము గత కొన్నేళ్లుగా లైంగిక వేధింపులకు, వర్ణ వివక్షకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. కళాక్షేత్ర డైరక్టర్ రేవతి రామచంద్రన్‌ను పదవి నుంచి తొలగించాలని, అంతర్గత ఫిర్యాదుల కమిటీని పునర్నిర్మించాలని ఆ లేఖలో విద్యార్థినీలు కోరారు.
అయితే కళాక్షేత్ర విద్యార్థినీల ఆరోపణలన్నీ నిరాధారమైనవని జాతీయ మహిళా కమిషన్ తోసిపుచ్చడం గమనార్హం. కళాక్షేత్ర ఫౌండేషన్‌ను 1936లో నృత్యకళాకారిణి రుక్మిణిదేవి అరండేల్ స్థాపించారు. భరతనాట్యం నృత్యం, కర్ణాటక సంగీతం, ఇతర సాంప్రదాయ కళల కోర్సులకు ఈ సంస్థకు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. ఉన్నత ప్రమాణాలు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈ సంస్థ ఎంతోమంది ప్రముఖ కళాకారులను తయారుచేసింది.