వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీహార్‌లో బిజెపిదే విజయం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న మహాఘట్ బంధన్‌ను ఓడిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడున్న ప్రభుత్వం బ్యాడ్ ప్రభుత్వం అంటే భ్రష్టాచార్ (అవినీతి) అరాజకత (ఆరాచకం) దమన్ (అణచివేత)లకు ప్రతీకగా మారిందని ధ్వజమెత్తారు.
నవాడా జిల్లాలోని హిసూవాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. వచ్చే ఏడాది తిరిగి లోక్‌సభ ఎన్నికలలో బిజెపి గెలవడం, ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని కావడం ఖాయం అని, ఆ తరువాత బీహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్ని జరిగితీరుతాయని ఆయన భరోసా వ్యక్తం చేశారు.
అప్పుడు ఈ ఘర్షణకారులందరిని తలకిందులుగా వేలాడదీయడం జరుగుతుందని అమిత్ షా హెచ్చరించారు. రాష్ట్రంలోని నితీశ్‌కుమార్ ప్రభుత్వం మతపరమైన ఉద్రిక్తతకు బాధ్యత వహించాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎక్కడా శాంతి లేని పరిస్థితి ఉందని విమర్శించారు. తాను సాసారాంలో పర్యటించాల్సి ఉండగా ఘర్షణల పట్టణాల పరిస్థితితో వీటిని వాయిదా వేసుకోవల్సి వచ్చిందని పేర్కొన్నారు.
సాసారాంలో ఇప్పుడు జనం వధ, తుపాకుల మోతలు సాగుతున్నాయని కేంద్ర హోం మంత్రి దుయ్యబట్టారు. కేంద్ర హోం మంత్రిగా తాను ఇక్కడి భయానక స్థితి గురించి రాష్ట్ర గవర్నర్‌తో మాట్లాడినట్లు, అయితే దీనికి జెడియు అధ్యక్షులు లలన్ సింగ్ అభ్యంతరం చెప్పారన విస్మయం వ్యక్తం చేశారు.
బీహార్‌లో అరాచకం ప్రబలుతూ ఉంటే తాము చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించారు. ఈ విషయం లలన్సింగ్లు ఇతరులు గుర్తుంచుకుని మాట్లాడాలని హెచ్చరించారు. బీహార్ ఈ దేశంలో ఓ రాష్ట్రం, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదని షా మండిపడ్డారు.
“నితీశ్ కుమార్ ప్రధాన మంత్రి కాలేరు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. నరేంద్ర మోదీని వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిని చేయాలని దేశ ప్రజలందరూ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ప్రధాని కల చెదిరిన తర్వాత మాట ప్రకారం తేజస్వి యాదవ్‌కు నితీశ్ కుమార్ పదవి అప్పగిస్తారు. ఇది జరిగి తీరుతుంది” అని అమిత్ షా పేర్కొన్నారు.
బిహార్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో 2024 ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. జేడీయూకు బీజేపీ తలుపులన్నీ మూసేసిందని స్పష్టంగా చెబుతున్నానని చెబుతూ ఈ విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు.