దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇవాళ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా లక్షణాలు ఆయనలో స్వల్పంగా కనిపిస్తున్నాయి.
ఈ విషయాన్నే ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా సోకిందని, డాక్టర్ల సూచన మేరకు కొన్ని రోజులపాటు ఇంటి నుంచే పనిచేస్తానని గెహ్లాట్ ప్రకటించారు. కరోనాపట్ల రాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహమ్మారి మరింత విస్తరించకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఒక ప్రకటన చేశారు.
కాగా, అశోక్ గెహ్లాట్ నిన్న సూరత్‌లో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీని కలిశారు. ఆ సభ కోసం వచ్చిన రాహుల్, ప్రియాంకలకు గెహ్లాటే స్వాగతం పలికారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు భూపేష్ బఘేల్, సుఖ్విందర్ సింగ్ సుఖు కూడా ఆ సభకు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో మంగళవారం గెహ్లాట్ కరోనా పాజిటివ్ రావడంతో ఆ కీలక నేతలు కూడా ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాగా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధరా రాజేకు కూడా మంగళవారం కరోనా పాజిటివ్‌గా తేలింది.
ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదౌతున్నాయి. కొన్ని చోట్ల మరణాలు నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా.. రోజుకు 3వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన తాజా సమాచారం ప్రకారం.. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,64 , 740 మంది కరోనా టెస్టులు చేసుకోగా అందులో 3,038 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో దేశంలో కరోనా బారిన పడ్డ వాళ్ల సంఖ్య 4,47,29,284 కి చేరింది. ఇందులో ప్రస్తుతం 21,179 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో ఢిల్లీ, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో ఇద్దరు చొప్పున, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం తొమ్మిది మంది చనిపోయారు. దీంతో కరోనా వల్ల చనిపోయిన వాళ్ల సంఖ్య 5,30,901కి చేరింది. కోవిడ్-19 రోజువారీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.1 శాతంగా ఉందని, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.