పంజాబ్‌లోని లుధియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన బాంబు పేలుడు సంఘటన వెనుక ఐఎస్ఐ, ఖలిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దానితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను రంగంలోకి దింపింది.
గురువారం మధ్యాహ్నం 12.22 గంటలకు కోర్టు రెండో అంతస్థులోని ఓ బాత్రూంలో ఈ దుర్ఘటన జరిగింది. పేలుడు ధాటికి బాత్రూం గోడలు కూలిపోయాయి. సమీపంలోని అద్దాలు పగిలిపోయాయి. భవనంలో కొంతభాగం దెబ్బతింది. పేలుడు జరిగిన సమయంలో జనంతో కోర్టు నిండిపోయింది.
గాయపడిన వారిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఓ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని లుధియానా పోలీసు చీఫ్ గుర్ప్రీత్ సింగ్ భుల్లార్ తెలిపారు. ‘‘ఆ వ్యక్తి పేలుడు పదార్థాలను వెంట పెట్టుకుని ఉండవచ్చు. లేదా ఫిదాయి (సూసైడ్ బాంబర్) అయి ఉండవచ్చు. ఇప్పుడే అన్ని వివరాలు చెప్పలేం. దీనిని ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నాం’’ అని భుల్లార్ పేర్కొన్నారు.
పేలుడు ఘటనను ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఖండిస్తూ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. అలాంటి వారి పనిపడతామని సీఎం హెచ్చరించారు.
ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేయాలని పంజాబ్ పోలీసులకు మాజీ సీఎం అమరిందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. పేలుడు ఘటనపై సాధ్యమైనంత త్వరగా సమగ్ర నివేదిక ఇవ్వాలని పంజాబ్ సర్కారును కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశించింది.
రాష్ట్రంలో అవాంఛనీయ సంఘనలు జరిగే అవకాశం ఉందని తాము హెచ్చరించినా పంజాబ్ సర్కారు పట్టించుకోలేదని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడి వెనుక ఖలిస్థానీ ఉగ్రవాదుల హస్తం ఉండవచ్చని ఆ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
కోర్టు కాంప్లెక్సులు, ఆవరణల్లో తగినంత భద్రత లేకపోవడం ఆందోళనకరమని పేర్కొంటూ అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను అమలు చేసే సంస్థలు చూసుకుంటాయని జస్టిస్ రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పరిణామాలను అడిగి తెలుసుకోవాలని పంజాబ్-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝాను ఆదేశించారు.