బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ పోలీసులు నాటకీయంగా అరెస్టు చేశారు. 151 పి ఆర్ సి క్రింద 10 పదవ తరగతి పేపర్ లీకేజీ విషయంలో మంగళవారం అర్థరాత్రి అరెస్ట్ చేశారు. కరీంనగర్ జ్యోతినగర్ లోని బండి సంజయ్ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత పోలీసు వాహనంలో యాదాద్రి జిల్లా, బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాల సమయంలో కరీంనగర్ లోని బండి సంజయ్ అత్తగారింట్లోకి కరీంనగర్ ఏసిపి తుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు.
బండి సంజయ్ అత్తగారు ఇటీవల మరణించారు. బుధవారం నాడు తొమ్మిది రోజుల కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పాల్గొనడానికి బండి సంజయ్ కరీంనగర్ లోని జ్యోతి నగర్ కు వచ్చారు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
బండి సంజయ్ ను కలిసి తమతో పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా కోరారు. తనను ఏ కేసులో తీసుకువెళ్తున్నారు? ఎందుకు రావాలి? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇంట్లో నుంచి కదలనని మొండికేశారు. ఈ క్రమంలోనే పోలీసులు బండి సంజయ్ కు సమాధానం చెబుతూ తమకు అతనిని అరెస్టు చేసి అధికారం ఉంటుందని, విషయం ఏంటో పోలీస్ స్టేషన్ కి వెళ్ళాక చెబుతామని చెప్పారు.
బలవంతంగా సంజయ్ ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో బండి సంజయ్ కు పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. వాహనంలో ఆయనను ఎక్కించుకొని హైదరాబాద్ వైపు బయలుదేరారు. కాగా, ఎక్కడికి తీసుకు వెళుతున్నారని కార్యకర్తలు, బంధువులు అడిగితే పోలీసులు ఎలాంటి సమాధానం చెప్పలేదు.
మరోవైపు బండి సంజయ్ అత్తగారింటికి పోలీసులు వచ్చారన్న సమాచారంతో పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. సంజయ్ ని అరెస్టు చేయొద్దు అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఇలా ఉండగానే కార్యకర్తలను తోసుకుంటూనే బండి సంజయ్ ని పోలీసులు తమ వాహనంలో తీసుకెళ్లారు.
బండి సంజయ్ ని తీసుకెళుతున్న వాహనం ఎల్ఎండి సమీపంలోకి వచ్చేసరికి మొరాయించింది. బండి సంజయ్ ని మరో వాహనంలోకి ఎక్కించి ముందుకు కదిలారు. అక్కడి నుంచి యాదాద్రి జిల్లా బొమ్మలరామారంకు చేరుకొని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ లో సంజయ్ ను ఉంచారు. అయితే, బండి సంజయ్ తన అరెస్టును అక్రమమని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నానని చెబుతూ లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
ఇలా ఉండగా, సంజయ్ అరెస్ట్ కు నిరసనగా బుధవారం రాష్ట్రంలోని అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు జరపాలని రాష్త్ర బిజెపి పిలుపిచ్చింది. పేపర్ లీకేజిలో ప్రజలలో వ్యక్తం అవుతున్న ఆగ్రవేశాల నుండి వారి దృష్టి మళ్లించడం కోసం ఈ అరెస్ట్ చేసారని బిజెపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా రెండో రోజు మంగళవారం కూడా పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాట్సా్‌పలో ప్రత్యక్షమైంది. హనుమకొండలో హెచ్ఎంటీవీ బ్యూరో మాజీ చీఫ్ బూరం ప్రశాంత్ ‘బ్రేకింగ్ న్యూస్’ అంటూ దానిని వైరల్ చేశాడు. హిందీ ప్రశ్న పత్రం లీకైందని, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారంటూ బండి సంజయ్‌తోపాటు చాలామందికి దానిని ఫార్వార్డ్ చేశాడు. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్, బీజేపీ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడిచింది.