పదవ తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఏ 1 నిందితుడిగా పేర్కొని పోలీసుల అదుపులోకి తీసుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో కరీంనగర్ జైలుకు తరలించారు. పోలీసులు బుధవారం సాయంత్రం హనుమకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరు పరచిన పోలీసులు తమ రిమాండ్ రిపోర్టును దాఖలు చేశారు.
ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనితో ఏప్రిల్ 19 వరకు రిమాండ్ విధించింది. బండి సంజయ్ తో పాటు మరో ముగ్గురు నిందితులను జైలుకు తరలింఛాయారు. కాగా ఈ కేసులో ఏకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం, అలాగే ఆయనను ఏ1గా చేర్చడం ఇప్పుడు సంచలనంగా మారింది.
అర్ధరాత్రి ఒంటిగంట బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ అనితా రాపోల్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ మొదటగా పోలీసుల రిమాండ్ రిపోర్టును పరిశీలించగా, ఆ తరువాత సంజయ్ తరపు న్యాయవాదుల వాదనలను విన్నారు. సంజయ్ అరెస్ట్ అక్రమమని న్యాయవాదులు మేజిస్ట్రేట్ ముందు వాదించినట్లు తెలుస్తుంది.
మేజిస్ట్రేట్ తీర్పు నేపథ్యంలో హన్మకొండ కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక అంతకుముందు సంజయ్ తనను అరెస్ట్ చేసిన విధానం, పోలీసుల తీరుపై తన న్యాయవాదులకు వివరించారు. షర్ట్ విప్పి ఒంటిపై గాయాలను బండి సంజయ్ న్యాయవాదులకు చూపించారు. చివరకు ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.