హనుమాన్ చేయలేనిది అంటూ ఏదీ లేదని, అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా తలచుకుంటే ఏదైనా సాధించగలరని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ హనుమాన్ మాదిరిగానే పార్టీ కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని సూచించారు.
పేదలకు సామాజిక సేవ, న్యాయం చేయటమే బీజేపీ విధానం అని స్పష్టం చేస్తూ ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలకు నిరంతరం సేవ చేస్తుందని కీర్తించారు. దేశంలోని కాంగ్రెస్, ఇతర పార్టీలు తమ విధానం ఏంటో తెలియకుండానే బీజేపీపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయని, అందుకే వారి అడ్రస్ గల్లంతు అయ్యిందని పేర్కొన్నారు.
దేశం కోసం బీజేపీ పెద్ద పెద్ద కలలు కంటుందని, వాటిని సాకారం చేసి దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో నిలబట్టటం కోసం అకుంఠిత దీక్షతో పని చేస్తున్నామని తెలిపారు.
దేశంలో అవినీతిపై యుద్ధాన్ని హనుమంతుడి తరహా పోరాటం చేస్తున్నామని చెబుతూ ఈ సందర్భంగా మిషన్ 2024 ప్రారంభించారు. రాబోయే ఎన్నికల ద్వారా దేశ ప్రజల కలలను సాకారం చేసే విధంగా కృషి చేయాల్సి ఉందని పార్టీ శ్రేణులకు చెబుతూ 2024లో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
దేశంలోని అన్ని వర్గాలకు తమ ప్రభుత్వం మేలు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో వైద్య, విద్య, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, రక్షణ సహా అన్ని రంగాలను గణనీయంగా అభివృద్ధి చేశామని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు, సాధికారత కోసం బీజేపీ కృషి చేస్తూనే ఉందని వివరించారు.
సబ్కా హాత్, సబ్కా సాత్, సబ్కా ప్రయాస్ నినాదాన్ని మోదీ ఇచ్చారు. అందరి భాగస్వామ్యంతో, అందరితో కలిసి, ప్రతీ ఒక్కరి కృషితో ముందుకు సాగుదామని బీజేపీ శ్రేణులకు ప్రధాని మోదీ హితబోధ చేశారు. విపక్షాలన్నీ సామాజిక న్యాయం అంటూ మాట్లాడుతున్నాయని, కానీ దేశంలోని ప్రతీ ఒక్కరికీ సాయం చేస్తూ బీజేపీ దాన్ని సాకారం చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
2024 ఎన్నికల్లో బీజేపీని ఎవరూ ఓడించలేరని మోదీ ధీమా వ్యక్తం చేశారు. “విపక్షాలు చాలా ఆత్రుతగా ఉన్నాయి. కానీ 2024లో బీజేపీని ఎవరూ ఓడించలేరు” అని మోదీ భరోసా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 6 నుంచి అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14వ తేదీ వరకు సామాజిక సామరస్య కార్యక్రమాల్లో పాల్గొనాలని బీజేపీ కార్యక్తలను మోదీ కోరారు.