ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆయన బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీ సభ్యత్వాన్ని అందించి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల బిజెపి కీలక నేతలు డాక్టర్ లక్ష్మణ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితర నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా, చీఫ్ విప్ గా, ఎమ్మెల్యేగా కిరణ్ కుమార్ రెడ్డి సేవలందించారని చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా కిరణ్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని తెలిపారు. కిరణ్ తండ్రి అమర్ నాథ్ రెడ్డి మంత్రిగా పని చేశారని, కిరణ్ సీఎంగా చేశారని చెప్పారు.
కిరణ్ కుమార్ రెడ్డి మంచి క్రికెటర్ అని, రంజీ స్థాయి వరకు ఆడారని తెలిపారు. కిరణ్ తన ఇన్నింగ్స్ ను కాంగ్రెస్ లో ప్రారంభించారని, ఇప్పడు బిజెపిలో కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తున్నారని చెప్పారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, స్పీకర్‌గా, చీఫ్ విప్‌గా ఉన్నారని, కీలక సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు.
1952లో కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి అనుబంధం ఏర్పడిందని, తన తండ్రి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని, కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వస్తుందని తాను ఎప్పుడు అనుకోలేదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. చినవయసులో తండ్రి చినపోవడంతో, వేరే పార్టీలోకి చేరాలని తనను ఆహ్వానించినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తప్పుడు నిర్ణయాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఆయన విమర్శించారు. నాయకులతో కలవకపోడం, వారి అభిప్రాయాలను గౌరవించకపోవడం వంటి పరిణామాలు అన్ని రాష్ట్రాల్లో జరిగాయని పేర్కొన్నారు. పార్టీలో తమకు తోచింది తాము చేసుకుంటూ పోయారని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉద్దేశించి విమర్శించారు.
బీజేపి ఎదగడానికి, కాంగ్రెస్ పార్టీ ఓడటానికి కారణాలు కష్టపడి పనిచేయడమే చెప్పారు. సరైన పద్ధతిలో పనిచేయడమే బీజేపీ విజయానికి కారణమని చెబుతూ రోగానికి సరైన మందు తీసుకుంటేనే చికిత్స జరుగుతుందని కిరణ్ వివరించారు. ప్రజల తీర్పును అంగీకరించాలని, ప్రజలే అసలైన వైద్యులని, రోగి స్థానంలో కాంగ్రెస్ పార్టీ అది గుర్తింపలేదని ధ్వజమెత్తారు.