తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలన నడస్తుందని.. ప్రతి ప్రాజెక్టులో అవినీతి వల్ల ఆలస్యం అవుతుందని అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికార పార్టీ బిఆర్ఎస్ పేరు ఎత్తుకుండానే, ఎవరి పేరు ప్రస్తావించకుండానే తీవ్రంగా విమర్సించారు. తెలంగాణ కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కుటుంబ పాలన నుండి విముక్తి కలిగించాలని పిలుపిచ్చారు.
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడానికి హైదరాబాద్ కు వచ్చిన ఆయన పెరేడ్ గ్రౌండ్స్ లో శనివారం జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని.. అదే నా బాధ, ఆవేదన అని చెప్పారు. “మేం ప్రజల కోసం పని చేస్తుంటే.. కొందరు మాత్రం అవినీతికే పనులు చేస్తున్నారు” అంటూ రాష్ట్ర పాలనపై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు.
ప్రతి ప్రాజెక్టులో కుటుంబ సభ్యుల ఆసక్తి తప్ప ప్రజల ప్రయోజనాలను చూడటం లేదని అంటూ కేసీఆర్ పాలనపై నిప్పుల వర్షం కురిపించారు. అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదన అంటూ అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా.. వద్దా అంటూ ప్రజలను ప్రధాని మోదీ ప్రశ్నించారు.
కుటుంబ పాలకులే అన్నింటిపైనా కంట్రోల్ కోరుకుంటారని చెబుతూ అలాంటి వారి వల్ల ప్రజలకు నష్టమని హెచ్చరించారు. అలాంటి వ్యక్తుల నుంచి తెలంగాణను కాపాడాల్సిన అసవరం ఉందా? లేదా?అంటూ ప్రజలను ప్రశ్నించారు. అవినీతిపై పోరాడాలా? వద్దా? అవినీతిని తరిమి కొట్టాలా? వద్దా? తెలంగాణ ప్రజలు చెప్పాలంటూ ప్రధాని పిలుపునిచ్చారు.
అవినీతి చిట్టా బయటకు వస్తుందనే భయంతోనే విపక్షాలు అన్నీ కోర్టుకు వెళ్లాయని మోదీ ఎద్దేవా చేశారు. అవినీతిపరులపై పోరాటానికి తెలంగాణ ప్రజల సహకారం కావాలని మోదీ కోరారు. బీజేపీని అశీర్వదిస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అంతకుముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సికిందరాబాద్ – తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును ఫ్రారంభించిన మోదీ తెలంగాణలో 6 జాతీయ రహదారుల నిర్మాణం, బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం సహా రూ.11,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే సికింద్రబాద్ మహబూబ్ నగర్ విద్యుదీకరణతో పూర్తెన డబ్లింగ్ లైన్ ను ప్రధాని జాతికి అంకితం చేశారు.
మూడు నెలల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండో వందే భారత్. అలాగే దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసారు.
ఏపీ, తెలంగాణను కలుపుతూ మరో వందే భారత్ రైలును ప్రారంభించామని చెబుతూ భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకటేశ్వర స్వామి నగరంతో కలిపామని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ గడిచిన 9 ఏళ్లలో 70 కీమీ మెట్రో నెట్ వర్క్ నిర్మించామని తెలిపారు.
తెలంగాణను అభివృద్ది చేసే అదృష్టం తనకు దక్కిందని అంటూ జాతీయ రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ ను ప్రారంభిస్తున్నామని చెప్పారు.
