మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సూత్రధారి వైసిపి నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహిత అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అని సిబిఐ స్పష్టం చేసింది. ఇటీవలనే అతనిని అరెస్ట్ చేసిన సిబిఐ తాజాగా కోర్టుకు సమర్పించిన వివరాలలో వివేకా హత్య సమయంలో ఘటనా స్థలంలో ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశారని నిర్ధారించింది.
వివేకా రక్తపు మడుగులో పడి ఉన్నా గుండెపోటుతో మరణించారంటూ ప్రచారం తొలుత ప్రారంభించింది శివశంకర్ రెడ్డిగా సీబీఐ స్పష్టం చేసింది.ఎక్కడా ఆధారాలు లేకుండా వివేకా బెడ్ రూం, వాష్ రూంలో రక్తపు మరకలను తుడిపించేశారని సీబీఐ కోర్టుకు నివేదించింది. హత్య సమయంలో వివేకా శరీరంపై ఉన్న గాయాలకు గజ్జల జై ప్రకాశ్‌రెడ్డి అనే కాంపౌండర్‌తో ఆయనే బ్యాండేజీ వేయించారని వివరించింది.
సీబీఐ అరెస్ట్ చేసిన శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. దీనికి సంబం ధించి నవాదనల సమయంలో శివ శంకర్ రెడ్డి పాత్ర పైన సీబీఐ పలు అంశాలను కోర్టు ముందు ఉంచింది. శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇస్తే ఆయన ఆధారాలను తారు మారు చేస్తారని సీబీఐ వాదించింది.
వివేకా హత్యకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఆయన సన్నిహితులు కలిసి నెల రోజుల ముందే కుట్రకు రూపకల్పన చేసారని సీబీఐ పేర్కొంది. వివేకాను హత్య చేస్తే పెద్ద మొత్తం లో డబ్బులు ఇస్తామంటూ సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరిలకు శివశంకర్‌రెడ్డి ఆఫర్ చేశాని సీబీఐ వివరించింది.
హత్య జరిగిన తరువాత పెద్ద సంఖ్యలో వివేకా ఇంటి వద్దకు జనం రావటంతో, ఆ సమయంలో శివశంకర్ రెడ్డి పులివెందుల సీఐను సంప్రదించిన శివశంకర్ రెడ్డి వివేకా గుండెపోటుతో మరణించారని, జనాన్ని నియంత్రించాలని కోరారని సీబీఐ పేర్కొంది. వివేకా రక్తపు వాంతులు, గుండెపోటుతో చనిపోయారంటూ శివశంకర్‌రెడ్డి, ఆయన సన్నిహితులు అక్కడకు వచ్చిన వారిని నమ్మించే ప్రయత్నం చేసారని సీబీఐ వివరించింది.
వివేకా హత్య వెనుక కీలక వ్యక్తులు ఉన్నారంటూ ఎర్ర గంగిరెడ్డి. సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరిలతో చెప్పినట్లు దస్తగిరి, వాచ్‌మన్ రంగన్నలు వాంగ్మూలం ఇచ్చిన అంశంతో పాటుగా ఈ హత్య చేస్తే దేవిరెడ్డి శంకరరెడ్డి రూ 40 కోట్లు ఇస్తారనే విషయాన్ని చెప్పిన విషయాన్ని సీబీఐ ప్రస్తావించింది.
హత్య కోసం సునీల్ యాదవ్ దస్తగిరికి అడ్వాన్సుగా రూ.కోటి ఇచ్చారని పేర్కొంది. దస్తగిరికి అడ్వాన్సుగా అందిన డబ్బును, ఆయన మున్నా వద్ద ఉంచగా, అందులో రూ.46.70 లక్షలు మున్నా నుంచి స్వాధీనం చేసుకున్నామని సీబీఐ వివరించింది.
ఇక, ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని ఈ ఏడాది మార్చిలో శివశంకర రెడ్డి పిలిపించి సీబీఐ దగ్గర తన పేరు, ఇతరుల పేర్లు చెప్పద్దని హెచ్చరించిన విషయాన్ని సీబీఐ కోర్టుకు నివేదించింది. శివ శంకర రెడ్డిని సీబీఐ నవంబర్ 17న అరెస్ట్ చేసింది. అయితే, ఆయన జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న సమయంలోనే న్యాయస్థానం అనుమతి లేకుండానే రిమ్స్ కు తరలించిన విషయాన్ని సీబీఐ ప్రస్తావించింది.