టెన్త్ క్లాస్ ప్రశ్నపత్రం లీకేజి కేసులో మొదటి నిందితుడిగా గతవారం అరెస్ట్ అయిన సందర్భంగా పోయిన్నట్లు చెబుతున్న తన మొబైల్ ఫోన్ లో కీలక సమాచారం ఉన్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక బాంబు పేల్చారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నట్లు అందులో సమాచారం ఉందని వెల్లడించారు.
తమతో పలుమార్లు సంప్రదింపులు జరిపారని, సీఎం కేసీఆర్కు ఈ విషయం తెలిసి మూర్చపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. గతంలో పలుమార్లు మంత్రులతో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నట్టు బీజేపీ నేతలు పేర్కొనడం గమనార్హం. బండి సంజయ్ కూడా పలుమార్లు అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరోసారి ఆ వ్యాఖ్యలను రిపీట్ చేయడం గమనార్హం.
తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ లీగల్ టీం సభ్యులతో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. చాలామంది ఎమ్మెల్యేలు తనతో ఫోన్లో మాట్లాడతారని, అందుకే పోలీసులను పంపించి తన ఫోన్ను కేసీఆర్ తీసుకున్నారని బండి ఆరోపించారు.
ప్రస్తుతం లీకేజి కేసులో కీలకంగా మారిన తన ఫోన్ ను తాను ఇవ్వడం లేదని పోలీసులు ఆరోపిస్తున్న తన ఫోన్ ప్రస్తుతం కేసీఆర్ దగ్గరే ఉందని సంజయ్ స్పష్టం చేశారు. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారనేది వినడమే ఆయనకు పని అంటూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కోసం పోలీసులే తన ఫోన్ను మాయం చేశారని బండి ఆరోపించారు. తన ఫోన్ బయటకు వస్తే సంచలన విషయాలు బయటకొస్తాయనే ఉద్దేశంతో కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారని పేర్కొన్నారు.
కరీంనగర్లోని తన ఇంట్లో తనను అరెస్ట్ చేసి సిద్దిపేటకు తీసుకెళ్లారని, సిద్దిపేట వరకు తన ఫోన్ ఉందన్నారు. ఆ తర్వాత తన ఫోన్ మిస్ అయిందని, ఇది పోలీసుల పనేనంటూ బండి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మెప్పు కోసం, ప్రమోషన్ల కోసం కొంతమంది పోలీస్ అధికారులు ఎంతకైనా దిగజారడానికి సిద్దంగా ఉన్నారని ఆరోపించారు.
కాగా, పోయిన తన ఫోన్ గురించి ఆదివారం కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో ఆన్ లైన్ లో సంజయ్ ఫిర్యాదు చేశారు. ఆ ఫోన్ ను వెతికి ఇవ్వమని కోరారు.
