‘‘ఆన్ లైన్ లో అమూల్ పాలు, పెరుగు అమ్ముతాం. బెంగళూరులో మేం వ్యాపారం ప్రారంభిస్తున్నాం” అని గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) చేసిన ట్వీట్ కర్నాటక ఎన్నికలలో రాజకీయ దుమారానికి దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ అంశం వివాదాస్పదంగా మారింది.
అమూల్ ప్రకటన ప్రతిపక్షాలు కీలక ఎన్నికల ప్రచార ఆయుధంగా ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నాయి. కర్నాటక రైతులందరూ కలిసి కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్)ను ఏర్పాటు చేసుకుని నందిని బ్రాండ్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. అమూల్ వస్తే కేఎంఎఫ్ పరిస్థితేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అమూల్, కేఎంఎఫ్ విలీనంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ విమర్శిస్తున్నది.
అమూల్ ప్రకటనను నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్, జేడీ(ఎస్)తో పాటు కన్నడ అనుకూల సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదికతో పాటు పలు సంఘాల నాయకులు రోడ్డెక్కడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
సోమవారం కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ హసన్‌లోని నందిని మిల్క్ పార్లర్‌ను సందర్శించారు. కొన్ని ఉత్పత్తులను కొనుగోలు చేసి నందినికి మద్దతు ప్రకటించారు.
రాష్ట్రంలో పాల ఉత్పత్తి రోజుకు 90 లక్షల లీటర్ల నుంచి 75లక్షల లీటర్లకు పడిపోయింది. నందిని ప్రతిరోజూ ముంబైకి 2.5 లక్షల లీటర్లు, హైదరాబాద్‌కు 1.5 లక్షల లీటర్లు, ఏపీకి మరో బ్యాచ్ పాలను సరఫరా చేస్తుంది. విదేశాలకు కూడా నందిని ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. మొత్తం అమ్మకాలలో 15 శాతం కర్ణాటక బయటే అవుతాయి.
అమూల్ పాలు ఎవరూ కొనొద్దంటూ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. కేఎంఎఫ్, అమూల్ విలీనం అడ్డుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలో నందిని ఉత్పత్తుల కృత్రిమ కొరత సృష్టించారని జేడీ(ఎస్) విమర్శించింది.
అయితే ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఖండించారు. అమూల్ కర్నాటకలో ప్రవేశించడం లేదని, కేఎంఎఫ్‌తో విలీనమవ్వట్లేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2019 తర్వాత కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రూ.10 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు పెరిగిందని.. రూ.20 వేల కోట్లు రాష్ట్రంలోని పాడి రైతులకు చేరాయని ఆయన వివరించారు.
ఇక, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కూడా రాష్ట్ర పాల ఉత్పత్తి దారుల సమాఖ్య నేతృత్వంలోని నందిని సంస్థకు దన్నుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.