ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన మతమార్పిడి నిరోధక బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదిపొంచింది. జేడీఎస్ తో పాటు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ హయాంలో సిద్దరామయ్య ప్రభుత్వమే అసలు ఈ బిల్లును రూపొందించిందా?
బెళగావిలో గురువారం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మతమార్పిడి నిరోధక బిల్లుపై చర్చ సందర్భంగా న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి మాట్లాడుతూ, 2016లో సిద్ధరామయ్య నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే మతమార్పిడి నిరోధక బిల్లు ముసాయిదాను ప్రారంభించిందని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు మరికొన్ని అంశాలను మాత్రమే జోడించిందని స్పష్టం చేశారు.
2016లో కర్నాటక లా కమిషన్ బిల్లును సిద్ధం చేసి స్క్రూటినిజింగ్ కమిటీ ముందుకు ఈ బిల్లు వచ్చిందని, దానిని కేబినెట్‌కు పంపిందని మధుస్వామి తెలిపారు. “సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటక మత స్వేచ్ఛ బిల్లును ప్రారంభించింది. బలవంతపు మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం ఉన్నందున మేము కొన్ని నిబంధనలను మాత్రమే జోడించాము, కానీ శిక్షాస్పద నిబంధనలలో ఎటువంటి మార్పులు తీసుకు రాలేదు” అని మధుస్వామి తెలిపారు.
అయితే మధుస్వామి వాదనను తీవ్రంగా ఖండించిన సిద్ధరామయ్య, న్యాయమంత్రి ఛైర్మన్‌గా ఉన్న స్క్రూటినైజింగ్ కమిటీ ఆమోదించకపోవడంతో అప్పటి న్యాయమంత్రి (టిబి జయచంద్ర)కి తెలియదని పేర్కొన్నారు.
అధికార పక్షం అందించిన పత్రాలను జల్లెడ పట్టిన స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి, 2016 నవంబర్ 16న అప్పటి న్యాయశాఖ మంత్రి స్క్రూటినిజింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన లేఖను చదివి, దానిపై అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతకం చేశారని వెల్లడించారు. బిల్లును మంత్రివర్గం ముందు ఉంచాలని కోరారని, ఈ బిల్లు గురించి అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయకు కూడా తెలుసని పేర్కొన్నారు.
బిజెపి సభ్యులు “సిగ్గు, సిగ్గు” అని అరుస్తూ, కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని ఆరోపించినప్పుడు, సిగ్గుపడ్డ సిద్ధరామయ్య లేఖపై సంతకం చేసినప్పటికీ, డ్రాఫ్ట్ చదవలేదని తప్పించుకొనే ప్రయత్నం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప జోక్యం చేసుకొంటూ “ఈ రోజు, మీరు ముఖ్యమంత్రిగా సంతకం చేసిన పత్రాన్ని నమ్మకపోతే, దేవుడే రాష్ట్రాన్ని రక్షించగలడు. మీరు ఎగతాళికి గురి అవుతారు” అంటూ హెచ్చరించారు.
ఆత్మరక్షణలో పడిన సిద్ధరామయ్య బిల్లును ప్రారంభించడం అంటే బిల్లును ప్రవేశపెట్టడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని చెప్పారు. “బిల్లును నా మంత్రివర్గంలో చర్చించలేదు లేదా ఆమోదించలేదు. శాసనసభలో ప్రవేశపెట్టలేదు” అని సిద్ధరామయ్య వాదించారు.
అధికార బీజేపీ తన వాదనకు మద్దతుగా ఉంచిన పత్రాలను ప్రతిపక్ష నేత పరిశీలించేందుకు వీలుగా స్పీకర్ కాగేరి సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.
ఆ తర్వాత, తన ప్రభుత్వం మతమార్పిడి నిరోధక బిల్లును ప్రారంభించలేదని సిద్ధరామయ్య నిర్ద్వంద్వంగా ఖందిస్తూ 2009లో ఒక ప్రతినిధి బృందం అప్పటి ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్పకు రాసిన లేఖను సభ ముందుంచారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న మతమార్పిడులను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ తరహాలో చట్టాన్ని రూపొందించాలని యడియూరప్ప ఆ లేఖ ఆధారంగా నిర్ణయించారు.
“యడ్యూరప్ప నవంబర్ 5, 2009 నాటి లేఖను బిల్లును రూపొందించిన లా కమిషన్‌కు పంపారు” అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
తాను సిఎంగా ఉన్న సమయంలోనే ఈ బిల్లును రూపొందించినట్లు అంగీకరించిన యడ్యూరప్ప, “అయితే మీరు (సిద్దరామయ్య) అప్పటి న్యాయ మంత్రి నేతృత్వంలోని స్క్రూటినిజింగ్ కమిటీ తర్వాత క్యాబినెట్ ముందు ముసాయిదా బిల్లును ఉంచాలని కోరుతూ ఫైల్ నోట్స్ చేశారు. 2016లో ఆమోదించారు” అని తేల్చి చెప్పారు.
అయితే రెండున్నరేళ్లుగా క్యాబినెట్లో గానీ, శాసనసభలో గానీ ఈ బిల్లును చేపట్టలేదని సిద్ధరామయ్య వాదించారు. దానితో జేడీఎస్ నేత హెచ్ డి రేవన్న కల్పించుకొంటూ బిజెపికి బీ టీం తాము కాదని, కాంగ్రెస్ అని ఈ వ్యవహారం స్పష్టం చేస్తున్నట్లు ఆరోపించారు.
సిద్ధరామయ్య అప్పుడు ఒకటిన్నర సంవత్సరాల పాటు బిల్లును వ్యతిరేకిస్తే, దానిని ఎందుకు వెనక్కి తీసుకోలేదు? అని ప్రశ్నించారు.
బిల్లును ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండాగా అభివర్ణించిన సిద్ధరామయ్యపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి కె ఎస్ ఈశ్వరప్ప మండిపడుతూ మతమార్పిడులను ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ బహిరంగంగా వ్యతిరేకిస్తోందని, ఇది రహస్య ఎజెండా కాదని స్పష్టం చేశారు. ” ఆర్ఎస్ఎస్కు మేం భిన్నం కాదు. సమాజ ప్రయోజనాల కోసం మరిన్ని బిల్లులు తెస్తాం” అని చెప్పారు.
2016లో ఆర్ఎస్ఎస్ “రహస్య ఎజెండా”ను “గౌరవించచడానికి” సిద్ధరామయ్య ఎందుకు ప్రయత్నించారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నిలదీశారు. “మీరు ఏది చెప్పినా ముసాయిదా బిల్లును మీ న్యాయమంత్రి పరిశీలించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ హిమాచల్‌లో లాగా బిల్లుకు మద్దతు ఇచ్చింది. ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ మతమార్పిడి నిరోధక చట్టం తెచ్చిన ప్రదేశ్.. ఆ బిల్లు సమాజ హితం అని మీరు కూడా నమ్మారు.. కానీ ఇప్పుడు రాజకీయ కారణాలతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు.. ఇదీ ద్వంద్వ ప్రమాణాలు. కాంగ్రెస్” అని బొమ్మై ఆరోపించారు.