తన ప్రైవేట్ లైఫ్ ను వదిలేసి, మళ్లీ ప్రజా జీవితంలోకి రావడానికి ప్రస్తుతం బీజేపీ మాత్రమే తన ముందు ఉన్న ఏకైక మార్గమని మాజీ ముఖ్యమంత్రి, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవలనే బీజేపీలో చేరిన ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తన ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు.
ఒకటి ప్రజా జీవితంలో ఉండాలా? లేక వద్దా? అనేవే తన ముందు ఉన్న ఆప్షన్లు అని పేర్కొన్నారు. యువకుడిగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడినని, సౌత్ జోన్ కు ఆడానని చెప్పారు. ఇప్పుడు గోల్ఫ్ ఆడుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు ఎందుకు వచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారని పేర్కొంటూ ఆ పార్టీలో ఉండి చేసేదేమీ లేదని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలని మీడియా ప్రతినిధులు అడగగా కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బిజెపి గురించే మాట్లాడుకుందామని చెప్పారు. రాష్ట్ర విభజన చేయడం వల్ల కాంగ్రెస్ భారీగా నష్టపోతుందని కాంగ్రెస్ హైకమాండ్ కు ఆనాడు చెప్పినా వారు వినలేదని ధ్వజమెత్తారు.
అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని గుర్తు చేశారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు తన హయాంలో లేవని పేర్కొన్నారు.
బీజేపీ ప్రాథమిక సభ్యత్వం కోసమే పార్టీలో చేరానని చెబుతూ బీజేపీ అధిష్ఠానం ఎక్కడ పనిచేయమంటే అక్కడ చేస్తానని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తాను పదవిని ఆశించి బిజెపిలో చేరలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం తాను పని చేస్తానని చెప్పారు. ఇకపై రెగ్యులర్ గా ఏపీకి వస్తానని అంటూ ఏపీకి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎంతో చేస్తోందని చెప్పారు.
ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం లేదని, కార్పొరేట్ కంపెనీలే ఉన్నాయని విమర్శించారు. విభజన హామీల అమలు సాధ్యం కాదని సీఎంగా ఉన్నప్పుడే చెప్పానని గుర్తుచేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో సెంటిమెంట్ ఉందని చెబుతూ ప్లాంట్‌ను లాభాల్లోకి ఎలా తేవాలని ఆలోచిస్తామతెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని పేర్కొంటూ ప్రత్యామ్నాయంగా నాడు స్పెషల్ ప్యాకేజీకి అందరూ అంగీకరించారుని కిరణ్‌కుమార్‌రెడ్డి గుర్తుచేశారు.