ఒక వంక తిరిగి బిజెపితో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాడంటూ రాజకీయ ప్రత్యర్థుల నుండి ఆరోపణలు ఎదుర్కొంటుండగా, బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీష్ కుమార్ బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఒకదారికి చేరే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ప్రతిపక్షాలు ఉమ్మడిగా అపోటీ చేస్తే బిజేపికి లోక్ సభలో 100కు మించి సీట్లు రావని కొద్దికాలం క్రితం ఆయన చెప్పడం గమనార్హం.
ముందుగా బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో వెళ్లి ఆయనతో పాటు, రాహుల్ గాంధీతో కూడా ఈ విషయమై సమాలోచనలు జరిపారు. తనతో పాటు బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్ జె డి అధినేత తేజస్వి యాదవ్ ను కూడా తీసుకు వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు.
దేశంలో ప్రధాని మోదీ పాలనకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ముందుకు వెళతామని చెప్పారు. జేడీయూ చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేస్తూ, ఇది చారిత్రక సమావేశమని అభివర్ణించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను, రాహుల్ గాంధీ కలసి నితీష్, తేజస్వియాదవ్ తదితరులతో మాట్లాడామని తెలిపారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ “మేము ఇక్కడ ఒక చారిత్రాత్మక సమావేశాన్ని నిర్వహించాము. చాలా విషయాలు చర్చించాం. మేము అన్ని పార్టీలను ఏకం చేసి రాబోయే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నాము” అని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను సమైక్యపరచడం ఓ ప్రక్రియ అని, దేశం కోసం ప్రతిపక్షాల దార్శనికతను ఇది తీర్చిదిద్దుతుందని ఆయన పేర్కొన్నారు.
నితీష్ కుమార్ మాట్లాడుతూ సాధ్యమైనన్ని పార్టీలను సమైక్యపరచి, కలిసికట్టుగా పని చేయడం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మరిన్ని పార్టీలను ఏకం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. అంతకు ముందు ఆర్జేడి అగ్ర నేత లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆయన కుమార్తె మీసా భారతి నివాసంలో నితీష్ కుమార్ కలిశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఆయన నివాసంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ కలిశారు. అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ “ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి నితీష్ కుమార్ మంచి చొరవ తీసుకున్నారు. మేము దీనికి మద్దతిస్తాం” అని తెలిపారు.
దేశం చాలా క్లిష్ట పరిస్థితిల్లో ఉందని ఆయన చెప్పారు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో ఎన్నడూ లేనంత అవినీతికర ప్రభుత్వం నేడు ఉందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇప్పటికే డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సహా పలువురితో మాట్లాడారు.