భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరారు. గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనంతరం ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
కార్యక్రమంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు మహేశ్వర్రెడ్డి పంపించారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరతారని చెప్పారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు తెలంగాణలో ప్రజలకు చేరేలా చూస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలేటి చేరిక వెనుక ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని తెలిపారు.
కేసీఆర్ అరాచక పాలన అంతం చేయటం బీజేపీకే సాధ్యమని, అందుకే తాను బీజేపీలో చేరానని తెలిపారు. కొంతకాలం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి అడుగులు వేస్తున్నాయని, రెండు పార్టీలు కూడా కలిసికట్టుగా పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.