తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచలోనే అతిపెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కృతమైంది. శుక్రవారం అంబేడ్కర్ మనమడు, మాజీ లోక్‌సభ సభ్యులు ప్రకాష్ అంబేడ్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణలో బౌద్ధ గురువులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం అంబేడ్కర్ స్మృతి వనాన్ని సీఎం కేసీఆర్, ప్రకాష్ అంబేడ్కర్ సందర్శించారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా అంబేడ్కర్ విగ్రహంపై రాష్ట్ర ప్రభుత్వం పూలవర్షం కురిపించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ప్రతియేటా జాతీయ అవార్డులు ఇస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. దేశంలోని వివిధ స్థాయిల్లో సేవలందించిన వారికి ఈ అవార్డులు ప్రతియేటా అంబేద్కర్ జయంతి రోజున అందజేస్తామని చెప్పారు. దీనికోసం ప్రభుత్వపరంగా రూ.51కోట్ల ను ఫిక్సెడ్ డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ డిపాజిట్ ద్వారా ఏటా సుమారు రూ.3కోట్ల వడ్డీ వస్తుందని, ఆ సొమ్మును అవార్డు విజేతలకు, కార్యక్రమ నిర్వహణకు ఖర్చు చేస్తామని చెప్పారు. అలాగే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే ప్రతియేటా దేశవ్యాప్తంగా ఉన్న దళితులకు ఏడాది 25లక్షల మందికి దళిత బంధు పథకం ద్వారా రూ.10లక్షలు అందజేస్తామని సభాముఖంగా ప్రకటించారు.
నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ గార్డెన్స్ పరిసరాల్లో మొత్తం 11.6ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. మహా విగ్రహం కొలువుదీరిన ప్రాంగణం ఆరు ఎకరాల వరకు ఉంటుంది. అందులో విగ్రహ నిర్మాణ ప్రాంతం 1.5 ఎకరం కాగా, మిగతా స్థలంలో ఉద్యానవనం, రాక్ గార్డెన్, ఫౌంటెన్ వంటివి నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా రూ.146 కోట్లు. ఇప్పటి వరకు రూ.84కోట్లు వెచ్చించారు. మిగతా నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. స్మారక భవనం మీద నేలవైన అంబేడ్కర్ విగ్రహం పాదాల చెంతకు వెళ్లడానికి ఇరువైపులా మెట్ల దారిని, ఒకే సారి 15 మంది వెళ్లగలిగే రెండు లిఫ్టులను ఏర్పాటు చేశారు.
భారీ భూకంపాలు, తుఫాన్లను తట్టుకునేలా, వందల ఏళ్ల పాటు విగ్రహం చెక్కు చెదరకుండా పటిష్టమైన లోహాన్ని ఉపయోగించారు. లోపలి వైపు స్టీల్‌కు పాలీయురేథీన్ కోటింగ్ చేశారు. స్మారక భవనం ఉన్న ప్రాంతమంతా అడుగున రాయి ఎక్కువగా ఉండడంతో పునాదుల వరకు భవనం నిర్మించేందుకే ఆరు నెలల సమయం పట్టిందని నిర్మాణ సంస్థ బాధ్యులు చెబుతున్నారు.