గుజరాత్ లో ఆప్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సూరత్‌లోని ఆరుగురు కార్పొరేటర్లు బిజెపిలోకి చేరారు. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి సమక్షంలో స్వాతి క్యాదా, నిరాలీ పటేల్, ధర్మేంద్ర వవ్లియా, అశోక్ధామి, కిరణ్ ఖోఖానీ, ఘనశ్యామ్ మక్వానాలు శుక్రవారం బిజెపి పార్టీలోకి చేరి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
వీరంతా బిజెపిలోకి చేరినట్లు ఆ పార్టీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. కాగా, ఇటీవల ఆప్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు రీటా ఖైనీ, జ్యోతి లాథియా, భావ్నా సోలంకి, విపుల్ మొవలియా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. 2021 గుజరాత్ స్థానిక ఎన్నికల్లో ఆప్ పార్టీ 27 స్థానాలను కైవశం చేసుకుంది.
సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసి) ఎన్నికల్లో 120 స్థానాల్లో బిజెపి 93 గెలిచింది. ఆప్ 27 స్థానాల్లో గెలిచింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఒక్కసీటును కూడా దక్కించుకోలేకపోయింది. ఇక తాజాగా బిజెపిలోకి కార్పొరేటర్ల చేరికతో గుజరాత్లో బిజెపి బలం పుంజుకుంటోంది. 93 కార్పొరేటర్ల ఉన్న బిజెపి కాస్తా.. ఇప్పుడు 103కి పెరిగింది. ఇప్పుడు ఆప్‌కి కేవల 10 మాత్రమే మిగిలి ఉన్నాయి.