‘కేంద్రం టెలిస్కోప్‌తో చూస్తోంది. ఇకపై మీ ఆటలు సాగవు. త్వరలోనే కేంద్రం జోక్యం చేసుకుంటుంది.’ అని బిజెపి ఎంపి సిఎం రమేష్ హెచ్చరించారు. ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోందని వెల్లడించారు.
నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదని ఆయన ప్రశ్నించారు. పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి.. వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలని ఆయన హితవు చెప్పారు. పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగా లేదని ధ్వజమెత్తారు.
అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందని రమేష్ హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరించిందో చూశామని గుర్తు చేశారు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయని తెలిపారు.
రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు.. అవినీతి కార్యక్రమాలపై ఈ నెల 28న బీజేపీ సభ నిర్వహిస్తోందని ప్రకటించారు. తొలిసారి సీఎం అయ్యారు కాబట్టి.. నెమ్మదిగా అర్ధం చేసుకుంటారని బీజేపీ ఇన్నాళ్లూ వేచి చూసిందని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం విధ్వంసకర విధానాన్ని అవలంభిస్తోందని సీఎం రమేష్ ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దశలవారీ మద్య నిషేధం కాదని.. దశలవారీ మద్యపాన వినియోగాన్ని జగన్ ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని రమేష్ మండిపడ్డారు.
ఏపీలో జరిగే ప్రతి కార్యక్రమం కేంద్ర నిధులతోనే చేస్తున్నారని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల నిర్మాణం కూడా కేంద్ర నిధులతోనే చేపట్టారని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగిన తర్వాత ఒక్క అడుగు ముందుకు పడలేదని ఆయన విమర్శించారు.
సినిమా రేట్లపై ఈ ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలపై ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపుపై థియేటర్ యజమానులు కోర్టుకెళ్తే హాళ్లను సీజ్ చేయిస్తారా? అని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు ఎంతున్నాయి? అక్కడి విధానం ఏంటో ఓసారి చూడాలని హితవు చెప్పారు. ఎవరినో దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారా ? అని రమేష్ ప్రశ్నించారు.