బుద్ధుడి బోధనలను అనుసరిస్తే ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో రెండు రోజులపాటు జరుగుతున్న అంతర్జాతీయ బౌద్ధ సదస్సును ప్రారంభిస్తూ శతాబ్దాలుగా భారతదేశం బుద్ధుడి బోధనలను పాటిస్తోందని ప్రధాని చెప్పారు.
భారత్ అమృత్‌కాల్‌లో అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అడుగులేస్తోందని చెబుతూ భారత్ తన సంక్షేమం కోసమే కాకుండా యావత్ ప్రపంచం సంక్షేమం కోసం సంకల్పించిందని తెలిపారు. గెలుపోటములు, పోరాటాలు, యుద్ధాల సాక్షాత్కారాలను త్యజిస్తేనే మనం ఆనందంగా జీవించగలమని ప్రధాని పేర్కొన్నారు.
వీటిని అధిగమించే మార్గాన్ని బుద్ధ భగవానుడు బోధించారని తెలిపారు. స్వీకరించగలం. శత్రుత్వాన్ని శత్రుత్వంతో నాశనం చేయలేం కానీ పేమ్రతో చేయొచ్చని స్పష్టం చేశారు. అసలైన ఆనందం శాంతిలో, కలిసి ప్రశాంతంగా జీవించడంలో ఉందని సూచించారు. భారత్ ప్రపంచానికి బుద్ధుణ్ని ఇచ్చింది.. యుద్ధాన్ని కాదని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు.
ప్రపంచం యుద్ధం, అశాంతితో ఇబ్బందిపడుతోందన్న మోదీ శతాబ్దాల క్రితమే బుద్ధుడు ఈ సమస్యకు పరిష్కారం చూపాడని తెలిపారు. బుద్ధుడు చూపిన మార్గంలో నడిస్తే భవిష్యత్తు ఉంటుందని, సుస్థిరత చేకూరుతుందని సూచించారు. బౌద్ధ సదస్సు సందర్భంగా బుద్ధ ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ సందర్శించారు.
బుద్ధుడి బోధనలు శతాబ్దాలుగా ఎంతో మందిని ప్రభావితం చేశాయని ప్రధాని తెలిపారు. దేశ ప్రజలు తమ ప్రయోజనాలతోపాటు ప్రపంచ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం చెప్పారు. ఏప్రిల్ 20న ప్రారంభమైన అంతర్జాతీయ బౌద్ధ సదస్సును భారత సాంస్కృతిక శాఖ, ఇంటర్నేషనల్ బుద్దిస్ట్ కాన్ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. రెండు రోజులపాటు జరుగుతోన్న ఈ సదస్సుకు 30 దేశాలకు చెందిన బౌద్ధ సాధువులు హాజరయ్యారు.
బుద్ధిజంపై అపారమైన విజ్ఞానంఉన్న అమెరికాకు చెందిన నిపుణులు ప్రొఫెసర్ రాబర్ట్ థుర్మన్ కీలక ప్రసంగం చేశారు. భారతదేశంలో ప్రాచీన బౌద్ధ వారసత్వాన్ని వెలికి తీసేందుకు థుర్మన్ చేసిన కృషికిగానూ 2020లో ఆయనకు పద్మ శ్రీ అవార్డు లభించింది.