ఇలా ఉండగా, కృష్ణా జలాల వాటా నీటి కేటాయింపులను తెలంగాణకు పెంచడంతో పాటు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్ ను పరిశీలించి పనులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
కృష్ణా జలాల వాటా కేటాయింపుల సందర్భంగా సీఎం కేసీఆర్ ఏపీ ప్రభుత్వానికి తలొగ్గి, 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయించేందుకు అంగీకరించారని గుర్తు చేశారు. కేసీఆర్ స్వార్థ రాజకీయాలకు, తప్పిదాలకు తెలంగాణ ప్రజలు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే కృష్ణా జలాల వాటా నీటి కేటాయింపులతోపాటు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్ ను పరిశీలించి పనులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సంజయ్ వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడారు.
వెంటనే డీపీఆర్ ను కేంద్ర జలవనరుల సంఘానికి (సీడబ్ల్యూసీ) పంపి పరిశీలించడంతోపాటు పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ పనుల అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కరీంనగర్–హసన్ పర్తి రైల్వే లైన్
కాగా, దశాబ్దాలకుపైగా పెండింగ్లో ఉన్న కరీంనగర్–హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందని బండి సంజయ్ వెల్లడించారు. అందులో భాగంగా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన రీసర్వే చేసి నివేదిక సమర్పించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉన్నతాధికారులను ఆదేశించారని ఆయన తెలిపారు.
అలాగే సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లిలో స్టేషన్ నిర్మాణం, రైలు హాల్ట్ పై సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిన జాబితాలో కరీంనగర్ రైల్వే స్టేషన్ కు చోటు కల్పించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. అలాగే జమ్మికుంట రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని కోరారు.