వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి నూతన సచివాలయం నుంచే పరిపాలన కొనసాగనుంది. ప్రస్తుతం ఆయా శాఖలకు కేటాయించిన గదుల్లో ఫర్నీచర్, కంప్యూటర్లకు విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఏర్పాటుచేసే ప్రక్రియ కొనసాగుతోంది. వారం రోజుల్లో ఆయా శాఖలను నూతన భవనంలోకి తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మొత్తం 28 ఎకరాల స్థలంలో 10,51,676 చదరపు అడుగుల్లో దీని నిర్మాణం జరగ్గా, ప్రధాన భవనం ఏరియా 7,88,904 చదరపు అడుగుల్లో నిర్మాణం జరిగింది. ఇక భవనం ఎత్తు 265 అడుగులు కాగా, మొత్తం 6 అంతస్థుల్లో దీని నిర్మాణం జరిగింది. డోమ్‌లు 7 నుంచి 11 అంతస్థుల్లో ఏర్పాటు చేయగా, వీటి బిల్టప్ ఏరియా 1,54,256 చదరపు అడుగుల్లో జరిగింది.
రూ.600 కోట్లకుపైగా వ్యయంతో అద్భుతంగా సచివాలయ భవనాన్ని నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం, దీనికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టింది. ఈ నెల 30వ తేదీన దీనిని ప్రారంభించేందుకు ఇప్పటికే సిఎం కెసిఆర్ ముహూర్తం ఖరారు చేయడంతో గడువులోగా సచివాలయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్ అండ్ బి అధికారులు రాత్రింబవళ్లు పనులు కొనసాగిస్తున్నారు.
భవనం చుట్టూ 2 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్, ఫ్రంట్ లాన్ ల్యాండ్ స్కేపింగ్ 5 ఎకరాల్లో, విఐపిలు, స్టాఫ్ పార్కింగ్ 2.5 ఎకరాల్లో, గుడి బిల్డప్ ఏరియా 2,713 చదరపు అడుగుల్లో, సందర్శకుల పార్కింగ్‌ను 1.5 ఎకరాల్లో నిర్మించారు.
మొత్తం 560 కార్లు, 720 బైక్‌లు ఇక్కడ పార్కింగ్ చేసేలా దీని నిర్మాణం జరిగింది. వీటితో పాటు చర్చి బిల్డప్ ఏరియా 1,911 చదరపు అడుగుల్లో, మసీదు జీ+3 బిల్డప్ ఏరియాలో 4,334 చదరపు అడుగుల్లో నిర్మాణం జరిగింది.
సచివాలయంలో పూర్తిస్థాయిలో కొత్త ఫర్నీచర్ ను వినియోగిస్తున్నారు. కొత్త ఫర్నీచర్ ఏర్పాటు చేసే పనులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం నెట్ వర్కింగ్, సంబంధిత పనులు కొనసాగుతున్నాయి. దీంతో తరలింపులో భాగంగా కంప్యూటర్లు, దస్త్రాలను మాత్రమే తరలించాల్సి ఉంది. తరలింపు కోసం ఏజెన్సీలను కూడా ఖరారు చేసి ఆయా శాఖలకు సమాచారం ఇవ్వనున్నారు. ఈలోగా కొత్త సచివాలయంలో శాఖల వారీగా కేటాయింపు చేయాల్సి ఉంది.
ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు కేబినెట్ సమావేశ మందిరం, సిఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అధికంగా విభాగాలు ఉండే ఆర్థిక, సాధారణ పరిపాలన, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పురపాలక, నీటిపారుదల శాఖలకు ఎక్కువ విస్తీర్ణం అవసరం ఉంటుంది. జీఏడికి మొదటి, ఆర్థికశాఖకు రెండో అంతస్థును కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. సంబంధిత శాఖ మంత్రి, కార్యదర్శి, విభాగాలు ఒకే దగ్గర ఉంటాయి.
ఇక సచివాలయ భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సచివాలయం పహారాకు సాయుధ బలగాలతో పాటు స్పెషల్ పోలీసులను వినియోగించనున్నారు. ఇప్పటి వరకు సచివాలయ భద్రతను ఎస్పీఎఫ్ నిర్వహిస్తుండగా వారి స్థానంలో స్పెషల్ పోలీసులను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది.