షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్‌లో మొదలైన రాజకీయ సంక్షోభం తాత్కాలికంగా కొలిక్కి వచ్చింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్‌ను నియమిస్తూ దేశ అధ్యక్షుడు షహాబుద్దిన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆర్థరాత్రి అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ ప్రకటన చేశారు.
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన ‘స్టూడెంట్స్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్’ ప్రతినిధులు మహమ్మద్ యూనస్ పేరును కొత్త ప్రభుత్వాధినేతగా ప్రతిపాదించారు. దేశంలో సైనిక పాలనను, సైనిక మద్దతు ఉండే ప్రభుత్వాన్ని, నియంత పాలనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ‘స్టూడెంట్స్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్’ జాతీయ సమన్వయకర్త నహీద్ ఇస్లాం మంగళవారం ప్రకటించారు. విద్యార్థులు ప్రతిపాదించిన ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
ఆర్థికవేత్త మహమ్మద్ యూనస్(84) సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విద్యార్థి నేతలు మంగళవారం డిమాండ్ చేశారు. తాము యూనస్‌తో మాట్లాడామని, ప్రభుత్వాన్ని నడిపించేందుకు ఆయన అంగీకరించారని విద్యార్థి నేత నహీద్ ఇస్లాం ప్రకటించారు. ప్రస్తుతం యూనస్ విదేశాల్లో ఉన్నారు.
యూనస్‌కు పాలన అందించేందుకు సైన్యాధ్యక్షుడు ఉజ్జమాన్ అంగీకరిస్తారా అనే అనుమానం మొదట తలెత్తింది. ఒకవేళ అంగీకరించకపోతే ప్రభుత్వ ఏర్పాటుపై విద్యార్థులు, సైన్యం మధ్య పేచీ మొదలవుతుందని అంతా అనుకున్నారు. అయితే, ఈ అవకాశం ఇవ్వకుండా మహమ్మద్ యూనస్నే తాత్కాలిక ప్రభుత్వాధినేతగా దేశాధ్యక్షుడు ఎంపిక చేశారు.
బంగ్లాదేశ్ పార్లమెంటు(జాతీయ సంసద్)ను రద్దు చేస్తున్నట్టు దేశ అధ్యక్షుడు షహాబుద్దిన్ మంగళవారం ప్రకటించారు. హసీనా రాజీనామా అనంతర పరిణామాలపై సోమవారం రాత్రి ఆయన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధినేతలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థి ఉద్యమ నేతలతో సమావేశమై చర్చించారు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు షహాబుద్దిన్ అనుమతి తెలిపారు. మళ్లీ ఎన్నికలు జరిపేందుకు వీలుగా పార్లమెంటును రద్దు చేస్తున్నట్టు చెప్పారు.
భయం గుప్పిట బంగ్లా హిందువులు
షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులను అల్లరిమూకలు లక్ష్యంగా చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 27 జిల్లాల్లో సోమవారం హిందువుల ఇండ్లు, వ్యాపారాలపై మూకలు దాడికి పాల్పడి, లూటీ చేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. అనేక హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. మెహెర్పూర్లోని ఇస్కాన్ ఆలయం, కాళీమాత ఆలయానికి దుండగులు నిప్పు పెట్టారు.
ఇస్కాన్ ఆలయానికి నిప్పుపెట్టినప్పుడు అక్కడ ఉన్న ముగ్గురు భక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని ఇస్కాన్ అధికార ప్రతినిధి యుధిస్తిర్ గోవిందదాస్ తెలిపారు. రంగ్‌పూర్ నగర కార్పొరేషన్లో కౌన్సిలర్‌గా ఉన్న హరధన్ రాయ్‌ను దుండగులు హత్య చేశారు. దేశవ్యాప్తంగా హిందువులకు చెందిన 54 ఆలయాలు, ఇండ్లు, ఆస్తులపై దాడులు జరిగాయని బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ తెలిపింది.