బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఆమెపై మరో ఐదు హత్య కేసులు నమోదయ్యాయి. హసీనాతోపాటు మాజీ మంత్రులు, అనుచరులపై ఈ కేసులు నమోదైనట్లు స్థానిక మీడియా నివేదించింది.
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత ఆందోళనల నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిన మాజీ ప్రధాని హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఆ అల్లర్ల సమయంలో ఐదుగురిని చంపినందుకు పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా, ఆమె కేబినెట్లోని మాజీ మంత్రులపై ఈ హత్య కేసులు నమోదైనట్లు సదరు మీడియా వెల్లడించింది.
దీంతో ఇప్పటి వరకూ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 89కి పెరిగింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో.. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ప్రాణాలను దక్కించుకునేందుకు సోదరితో కలిసి దేశం వీడారు.
ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. హసీనా దేశం వీడిన తర్వాత రాజకీయ అస్థిర పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్లో నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే.