వచ్చే ఏడాది చైనాలోని బీజింగ్‌లో జరుగవలసిన వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ పట్ల నీలినీడలు వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే మెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, లిథువేనియా, కెనడా వంటి దేశాలు ఈ క్రీడలను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా జపాన్ ఆ దేశాల జాబితాలో చేరింది.
చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న ఆరోపణలపై దౌత్యవేత్తలను ఆ దేశానికి పంపేందుకు ఈ దేశాలు నిరాకరించాయి. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకల్లో తమ దేశం తరఫున అధికారులు గానీ, రాయబారులు గానీ పాల్గొనరని ఈ దేశాలు ప్రకటించాయి.
అయితే క్రీడాకారులు క్రీడల్లో పాల్గొంటారని వెల్లడించారు. బహిష్కరణ గురించి ఐరోపా దేశాలతో చర్చిస్తున్నామని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ కార్యదర్శి తెలిపారు.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజంలో సార్వత్రిక విలువలైన స్వేచ్ఛ, ప్రాథమిక మానవ హక్కుల పట్ల గౌరవం, చట్ట నియమాల సార్వత్రిక విలువలకు చైనా హామీ ఇవ్వడం చాలా ముఖ్యమని జపాన్ విశ్వసిస్తోందని పేర్కొన్నారు.
అమెరికా చేపట్టిన దౌత్యపరమైన బహిష్కరణకు మద్దతు పెరుగుతూ ఉండడం పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ప్రతీకారం తీర్చుకోనున్నట్లు కూడా చైనా హెచ్చరించింది. తాము కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, కానీ వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించబోమని అంటూ చైనా విదేశాంగ మంత్రి జావో లిజియాన్ ప్రకటించారు.
క్రీడల్లో రాజకీయానికి అమెరికా తెరలేపుతోందని చైనా మంత్రి జావో ఆరోపించారు. అబద్ధాలు, అసత్యాల ఆధారంగా తమల్ని అమెరికా బహిష్కరిస్తున్నట్లు ఆరోపించారు. ఒలింపిక్ చార్టర్ స్ఫూర్తితో అవసరమైన రాజకీయ తటస్థతను అమెరికా, ఇతర దేశాలు ఉల్లంఘిస్తున్నాయని చైనా విమర్శించింది.
మరోవంక,అగ్రరాజ్యం అమెరికా నిర్ణయానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) మద్దతు తెలిపింది. రాజకీయ వేత్తలు, దౌత్యవేత్తలు వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలా వద్దా అనేది పూర్తిగా రాజకీయ నిర్ణయమని వారి అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. అది ప్రభుత్వాల ఇష్టం. అంతర్జాతీయ ఒలిపింక్ కమిటీ అనుసరించే రాజకీయ విధానం ఆధారంగా అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు.
అమెరికా ప్రభుత్వం ఒలింపిక్ క్రీడల్లో అథ్లెట్లు పాల్గొనే అంశంపై రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవడాన్ని ఒలింపిక్ కమిటీ స్వాగతిస్తుందని పేర్కొన్నారు. ఇక క్రీడలు, ఒలింపిక్స్ ద్వారా మెరుగైన ప్రపంచాన్ని నిర్మించాలనే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో అందరూ ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
క్రీడలకు సంబంధించి ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 193 దేశాలు ఆమోదించాయని ఆయన వివరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి జరిగే వింటర్ ఒలింపిక్స్‌కు బీజింగ్ వేదికగా నిలువనుంది.
చైనాలో వీఘర్ ముస్లింలపై ఊచకోతకు చైనా పాల్పడుతున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. జింజియాంగ్ ప్రావిన్స్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అమెరికా నిర్ణయానికి పలు దేశాలు మద్దతుగా నిలిచాయి. ఇలాంటి స్థితిలో వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయ లేదా అనేది సందేహంగా తయారైంది. అయితే చైనా ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్రీడలను నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. బీజింగ్ ఒలింపిక్స్ 2022 ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 20 వరకు జరగనున్నాయి.