ఖలిస్థానీ సానుభూతిపరుడిగా మారిన అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. పంజాబ్ మోగాలో పోలీసులకు అతను లొంగిపోయాడు. నిజానికి అతన్ని మార్చి 18న అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ విషయం తెలియడంతో అతను తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతని కోసం 80 వేల మంది పోలీసులు వేట సాగించారు.
35 రోజులపాటూ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన అమృత్‌పాల్ ఎట్టకేలకు లొంగిపోయాడు. అతను అరెస్ట్ అవ్వడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అమృత్ పాల్ ను మోగా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అమృత్ పాల్ సింగ్ “వారిస్ పంజాబ్ దే” సంస్థ వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. అమృత్ పాల్ పంజాబ్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టినట్లు సమాచారం. ఇతను పంజాబ్ లో ఖలిస్థానీ కార్యకలాపాలను సాగించాడు. అల్లర్లు సృష్టించినట్లు పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ పై కేసులు పెట్టారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
మోగా రోడ్ గ్రామంలోని జనమ్ ఆస్థాన్ సంత్ ఖల్సా గురుద్వారాలో అతన్ని పోలీసులు అరెస్టు చేసినట్లు ఓ సినియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఖలిస్థాన్ మద్దతుదారుగా మారిన అమృత్‌పాల్ సింగ్.. పంజాబ్ ప్రభుత్వానికీ, కేంద్ర ప్రభుత్వానికీ సమస్యగా మారాడు. అతని నిర్ణయాలు, ప్రకటనలు, చర్యలన్నీ దేశ వ్యతిరేకంగా ఉండటంతో అతన్ని అరెస్టు చెయ్యాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా ప్రయత్నించాయి.
మార్చి 18న అమృత్‌పాల్ సింగ్ పారిపోయాక అతని మద్దతు దారుల్ని ఒక్కొక్కర్నీ అరెస్టు చేస్తూ వచ్చారు పోలీసులు. దాంతో అమృత్‌పాల్ పోలీసులకు లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 35 రోజులుగా అతను రకరకాల వేషధారణల్లో తిరుగుతూ పోలీసులకు దొరకకుండా తప్పించుకున్న అతను సొంత గ్రామంలోనే చిక్కాడు.
ఏప్రిల్ 21న అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీ గురు రామ్ దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో లండన్ వెళ్లేందుకు విమానం ఎక్కబోతుండగా ఆమెను అరెస్టు చేశారు. ఆమెను తన భర్త సొంతూరైన అమృత్‌సర్‌లోని జల్లుపూర్ ఖేరాకు తరలించారు. ఈ పరిస్థితుల్లో తన ఫ్యామిలీకి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతోనే అమృత్‌పాల్ పోలీసులకు లొంగిపోయాడనే ప్రచారం జరుగుతోంది.