తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలా? వద్దా? అంటూ కార్యకర్తలను అడిగిన అమిత్ షా సమాధానం ఢిల్లీలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి వినపడేలా చెప్పాలని కోరారు.
బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన చేవెళ్ల విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పాలన కొనసాగిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ రావడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోసం తహతహలాడుతున్నారని., . రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మరోవైపు పేపర్ లీకేజీ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు అమిత్ షా. పేపర్ లీక్ ఘటన గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
ఆయన ఏం తప్పు చేశారని బండి సంజయ్‌ని అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. అరెస్ట్‌లకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఏమాత్రం భయపడరని కేంద్ర హోమ్ మంత్రి స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో లక్షల మంది యువతకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఏ పరీక్ష పెట్టినా పేపర్ లీక్ అవుతోందన్న అమిత్ షా ఇలాంటి ఘటనలపై సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పందిచకపోవటం విడ్డూరమని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే.. ఏవి పాలు.. ఏవి నీళ్లు అనేది బయటపడుతుందని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని దోచుకుతింటోందని.. అవినీతి గంగ ప్రవహిస్తోందంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజా ధనాన్ని సీఎం కేసీఆర్ పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేసారు.
“కేసీఆర్.. ప్రధాన మంత్రి సీటు ఖాళీగా లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీనే ప్రధాన మంత్రి. ప్రధాని సీటేమో కానీ ముందు సీఎం సీటును కాపాడుకో.” అంటూ హితవు పలికారు. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలో వచ్చేముందు తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పారు. బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటామని చెబుతూ సీఆర్ అవినీతి పాలనపై పోరాటం చేయాలని పిలుపిచ్చారు.
మరోవైపు, కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. ఎంఐఎంకు భయపడే బీఆర్ఎస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని జరపట్లేదని ఆరోపించారు. ఓవైసీ ఎజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.