పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్వాసకోశ సమస్యలతో మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ప్రకాశ్ సింగ్ బాదల్ 5 సార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
సీనియర్ శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) నాయకుడు గత ఏడాది జూన్‌లో ‘గ్యాస్ట్రిటిస్’, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ అనంతర ఆరోగ్య పరీక్షల కోసం ఫిబ్రవరి 2022లో ఆయనను మొహాలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గతేడాది జనవరిలో బాదల్‌కు కరోనా సోకడంతో లుథియానాలోని ఓ ఆస్పత్రిలో చేరారు.
బాదల్ ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, కుమార్తె ప్రణీత్ కౌర్. ప్రకాష్ సింగ్ బాదల్ 1947లో రాజకీయాలను ప్రారంభించారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అతి పిన్న వయస్కుడైన సర్పంచ్ అయ్యాడు.
1957లో తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 1969లో మళ్లీ గెలిచారు. 1969-70 వరకు పంచాయత్ రాజ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ తదితర మంత్రిత్వ శాఖల మంత్రిగా ఉన్నారు. తన ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో రెండుసార్లు మాత్రమే ఓటమిపాలయ్యారు ప్రకాశ్ సింగ్ బాదల్. 1967, 2022 ఎన్నికల్లో పరాజయం చవిచూశారు.
1970లో 43 సంవత్సరాల వయసులోనే పంబాజ్ ముఖ్యమంత్రి అయ్యారు బాదల్. పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పిన్న వయస్కుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. చివరగా 2017లో ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. 1970 నుంచి 2017 మధ్య పంజాబ్ ముఖ్యమంత్రిగా అయిదుసార్లు విధులు నిర్వర్తించారు ప్రకాశ్ సింగ్ బాదల్.
1970-71, 1977-80, 1997-2022, 2007-2017 మధ్య అయిదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రకాశ్ సింగ్ బాదల్ బాధ్యతలు చేపట్టారు. చివరగా శిరోమణి అకాలీదళ్ – బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి 2017 వరకు సీఎంగా పని చేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో లంబి నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు. 1995 నుంచి 2008 వరకు శిరోమణి అకాలీదళ్ పార్టీకి అధ్యక్షుడిగా పని చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీపై గట్టి పట్టు ఉన్న నేత ఆయన. 2015లో బాదల్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. బాదల్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే ప్రధధాని మోదీ ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు కూడా. బాదల్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పంజాబ్ సిఎం మాన్ సహా వివిధ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాదల్ మృతితో ఒక శకం ముగిసిందని వారు పేర్కొన్నారు.