చత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో బుధవారం 11 మంది పోలీసులు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా డీఆర్జీ విభాగానికి చెందిన పోలీసులుగా గుర్తించారు.
దంతేవాడ జిల్లాలోని అరన్పూర్ సమీపంలో డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై ఐఈడి దాడి జరిగింది. నక్సలైట్లు ఐఈడీని అమర్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ కూడా జరిగినట్లు సమాచారం.
దీంతో పాటు జవాన్ల పికప్ వాహనాన్ని కూడా మావోయిస్టులు పేల్చివేశారు. అందులోని 10 మంది జవాన్లతో పాటు డ్రైవర్ కూడా మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులపై దాడికి 50 కేజీల ఐఈడీని ఉపయోగించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
పేలుడు ధాటికి రోడ్డుపై 12 అడుగుల లోతులో 25 అడుగుల మేర భారీ గుంత ఏర్పడింది. షాక్‌వేవ్‌కి వాహనం తునాతునకలు కాగా.. కొన్ని రైఫిళ్లు ఆకారంలో లేకుండా పోయాయి. బస్తర్‌లో 2021 తర్వాత మావోయిస్ట్‌లు జరిపిన అతిపెద్ద దాడి ఇదే. ఏప్రిల్ 3, 2021లో బిజాపూర్ వద్ద మావోల దాడిలో 22 మంది జవాన్లు అమరులుకాగా.. మరో 30 మంది గాయపడ్డారు.
ఈ ఘటనపై ఘాటుగా స్పందించిన చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నక్సలైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, నక్సలిజాన్ని రూపుమాపుతామని హెచ్చరించారు. దీనిపై తమకు సమాచారం అందిందని..ఇది విచారకరమని వ్యాఖ్యానించారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాననితెలిపారు.
ఈ పోరాటం చివరి దశలో ఉందని.. నక్సలైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని చెప్పుకొచ్చారు. ప్రణాళికాబద్ధంగా నక్సలిజాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. కాగా, ఘటన తీవ్రతను గమనించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి బఘెల్‌తో మాట్లాడి కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
దంతేవాడలో నక్సలైట్ల దాడి తర్వాత మహారాష్ట్రలోని గడ్చిరోలిలో హై అలర్ట్ ప్రకటించారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతంలోని అన్ని పాయింట్లను ప్రమాద దృష్ట్యా అప్రమత్తం చేశారు. అన్ని సరిహద్దు ప్రాంతాల్లోనూ అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి ముప్పు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీ-60 కమాండోలు, గడ్చిరోలి పోలీసులను కోరారు.
మరోవంక, ఛత్తీస్‌గఢలో 11 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన గంటల వ్యవధిలోనే అసోంలో అనుమానాస్పద ఐఈడీని కనుగొన్నారు. తీన్‌సుకియాలోని మకుమ్ ప్రాంతంలో కనిపించిన ఐఈడీని భద్రతా బలగాలు సకాలంలో స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేయడంతో భారీ ప్రమాదం తప్పంది. మకుమ్ బైపాస్ రోడ్డులోని ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఈ పేలుడు పదార్ధాన్ని కనుగొన్నారు.