అమెరికా-దక్షిణ కొరియా మధ్య అత్యంత కీలకమైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద ఉత్తర కొరియాను అదుపు చేసేందుకు అమెరికా అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గామిని దక్షిణకొరియా తీరంలో మోహరించనుంది.
అలాగే సియోల్ న్యూక్లియర్ ప్లానింగ్ ఆపరేషన్స్‌లో భాగం కానుంది. దీనికి బదులుగా దక్షిణ కొరియా సొంతంగా అణ్వాయుధాలు తయారు చేయాలనుకొన్న ప్రణాళికలను వదులుకోనుంది. దీనిని ‘వాషింగ్టన్ డిక్లరేషన్’గా వ్యవహరిస్తున్నారు.
దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ ”ఈ ఒప్పందం వల్ల ఉత్తర కొరియాను నిలువరించే క్రమంలో భాగస్వాముల మధ్య సమన్వయం పెరుగుతుంది” అని వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం యుద్ధ సమయాల్లో దక్షిణ కొరియాను రక్షించాల్సిన బాధ్యత అమెరికాపై ఉంది.
దీనికి తోడు అవసరమైన సమయంలో అమెరికా అణ్వాయుధాలను వినియోగిస్తామని కూడా హామీ ఇచ్చింది. కానీ, దక్షిణ కొరియాలోని కొన్ని వర్గాలు అమెరికా మాటలను నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో సొంతంగా అణ్వస్త్రాలను అభివఅద్ధి చేసుకోవాలనే డిమాండ్ మొదలైంది.
మరోవైపు ఉత్తర కొరియా కూడా అణుబాంబులను అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా – దక్షిణ కొరియా మధ్య వాషింగ్టన్ డిక్లరేషన్ జరగటం గమనార్హం. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూ సుక్ యోల్ వైట్ హౌస్‌లో మాట్లాడుతూ ”వాషింగ్టన్ డిక్లరేషన్ రూపంలో దక్షిణ కొరియాకు అద్భుతమైన హామీ లభించింది” అని పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య కొనిు నెలల పాటు జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. మరోవైపు ఈ ఒప్పందాన్ని చైనా తీవ్రంగా విమర్శించింది. ఈ ఒప్పందం ”ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలను పెంచి, వివాదాలను ముదిరేలా చేస్తుంది” అని పేర్కొంది.