* నేడు మాలవీయ జయంతి
భారతదేశపు మొట్ట మొదటి ప్రైవేట్ యూనివర్సిటీ ఏది?
బెనారస్ హిందూ యూనివర్సిటీ!
దానిని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు మదన్ మోహన్ మాలవీయ స్థాపించారు. అందుకోసం దేశం అంతా తిరిగి విరాళాలు సేకరించారు.
అందుకే ఆయనను చాలామంది “నువ్వు మదన్ మోహన్ మాలవీయవి కావు బాబూ. నువ్వు మనీ మేకింగ్ మెషీన్ వి” అని హాస్యమాడేవారు కూడా. అంత ఓపిగ్గా, పట్టుదలగా ఆయన విరాళాలు సేకరించేవారు. ఇదే క్రమంలో ఆయన హైదరాబాద్ లో నిజాం దగ్గరకి వచ్చారు.
నిజాం మహా పిసినారి. పైపెచ్చు మహా మత దురహంకారి. ” నీకెంత ధైర్యం…హిందూ యూనివర్సిటీ కోసం నేను విరాళం ఇవ్వాలా” అంటూ తన చెప్పును విసిరేశాడు కోపంగా. మాలవీయ మారు మాట్లాడలేదు. ఆ చెప్పును కళ్లకద్దుకుని “మహా ప్రసాదం” అంటూ బయటకి వచ్చేశాడు.
బాగా రద్దీగా ఉన్న కూడలిలో నిజాం చెప్పుని ఉంచి, దాన్ని అమ్మకానికి పెట్టాడు. నిజాం ప్రభువు చెప్పును కొనేందుకు జనం ఎగబడ్డారు. పోటీ పెరిగింది. వేలం మొదలైంది. ఈ సంగతి నిజాం చెవిన బడింది. నవాబుగారి చెప్పు తక్కువకి వేలం పోతే పరువునష్టం.
ఆ చెప్పు మాలవీయ చేతికి ఎలా వచ్చిందో తెలిస్తే సర్వభ్రష్టం. ఆ చెప్పును ఏ బిచ్చగాడో వేసుకుంటే ప్రతిష్ఠ మూసీ పాలు!! అందుకే నిజాం ప్రభువు తన సేవకుల్ని పిలిచి “ఎంత ధరైనా ఫరవాలేదు. నా చెప్పును కొని తీసుకురండి” అని పురమాయించాడు. చివరికి భారీ ధరకు తన చెప్పును తానే కొనుక్కున్నాడు నిజాం నవాబు.
నిజానికి నిజాం తన చెప్పుతో తానే కొట్టుకొనేటట్లు చేసిన ఘనత మాలవీయది. నిజాం వంటి వాని నుండి కూడా విరాళాలు సేకరించి “తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు” అని నిరూపించారు. మన దేశపు ధ్యేయవాక్యం “సత్యమేవ జయతే”ని ఆధునిక కాలంలో మొట్టమొదటగా ఉపయోగించిందీ మదన్ మోహన్ మాలవీయ కావడం విశేషం.