బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళితబంధు డబ్బుల నుండి 3 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలు లంఛం తీసుకుంటున్నారని స్వయంగా ప్రకటించిన సీఎం కేసీఆర్ వెంటనే వారిని బర్తరఫ్ చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే, బిజెపి నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆ విధంగా డబ్బు తీసుకోవడం నేరమని, జుగప్పాకరం అని పేర్కొంటూ ఆ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఆ బాధితులకు డబ్బులు వాపస్ ఇప్పించాలని ఈటెల డిమాండ్ చేశారు. దళితులందరికి ఈ పథకం అందేలా చూడాలని కోరారు. ఈ పథకం అస్తవ్యస్తంగా మారిందని, కంట్రోల్ తప్పింది అనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణలను ప్రతికలో, ప్రతిపక్షాలో చేయలేదని, తమ పార్టీ ఎమ్మెల్యేలపై స్వయంగా సీఎం కేసీఆర్ చేశారని ఈ సందర్భంగా ఈటెల పేర్కొన్నారు.
ఇసుక మాఫియా, మద్యం మాఫియా, లాండ్ మాఫియాలతో పాటు ఇప్పుడు దళిత బంధు అక్రమాలను అరికట్టడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో రూ. 2 లక్షల కోట్లతో ఒక్కొ దళితునికి రూ. 10 లక్షలు ఇస్తానని సిఎం కెసిఆర్ దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని ఈటెల గుర్తు చేశారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో 17,600 పైగా కుటుంబాలకు దళితబంధు ఇస్తామని చెప్పినా ఇంకా పూర్తిగా అందలేదని చెప్పారు. 3000 కుటుంబాలకు అసలే రాకపోగా చాలా కుటుంబాలకు రెండవ విడత అందలేదని పేర్కొన్నారు.
ఎమ్యెల్యేల పేర్లు బయట పెట్టాలి
దళితబంధులో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని బిజెపి ఎమ్మెల్యే ఎం రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. తప్పు చేసిన మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మందలించాల్సిందిపోయి వారిని సీఎం కేసీఆర్ వెనకేసు కొస్తున్నారని విమర్శించారు.
సొంత ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే సీఎం ఏం చేస్తున్నారు? వారిపై సీబీఐ దర్యాప్తు చేయించే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. ఈ అంశాన్ని ఏసీబీ డీజీ సుమోటోగా కేసు నమోదు చేసి సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? అని మరోసారి ప్రశ్నించారు.