మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా 91 ఆకాశవాణి ట్రాన్స్ మీటర్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.ఈ ట్రాన్స్ మీటర్లన్నీ 100 వాట్ల ఎఫ్ఎం ట్రాన్స్ మీటర్లు. వీటిలో 4 ట్రాన్స్ మీటర్లు తెలంగాణలోని నల్గొండ, దేవరకొండ, రామగుండం, సిర్పూర్ లలో ప్రారంభం అయ్యాయి.
18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 84 జిల్లాల్లో మొత్తం 91 ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లు శుక్రవారం నుండి పనిచేయడం ప్రారంభించాయి. దేశంలో ఎఫ్ఎం కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 84 జిల్లాల్లో 100 వాట్ల 91 కొత్త ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాలు, లక్షిత జిల్లాల్లో కవరేజీని పెంపొందించడం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. దీంతో ఎఫ్ ఎం అవకాశం పొందలేని 2 కోట్ల మంది ప్రజలకు లబ్థి చేకూరుతుందని తెలిపారు.
ప్రతి ట్రాన్స్ మీటరు 20 కిలో మీటర్ల పరిధి వరకు ప్రసారాలు చేయగలవు. ఆకాశవాణి ఎఫ్ఎం సేవలను ఈ ట్రాన్స్ మీటర్లు మరింత విస్తరించి, సమాచారాన్నీ, వినోదాన్నీ ప్రజలకు అందించటానికి దోహదం చేస్తాయి. వీటి ఫ్రీక్వెన్సీ 100.1 మెగా హెర్జ్.
ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మక చర్య. వినోదం, క్రీడలు, వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులకు చేరవేయడంలో ఇది ఎంతగానో దోహదపడుతుందని.. మన్ కీ బాత్కు ఆదరణ పెరిగిందని తెలిపారు.
మరోవైపు ప్రధాని మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ సందర్భంగా ఒడిశా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీలో సముద్ర తీరం వెంబడి ప్రత్యేకంగా ఓ సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను దేశ ప్రజలతో ఆకాశవాణి ద్వారా పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్ ఈ నెల 30న ప్రసారం కానుంది.
ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం వంద చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. మండలం నుంచి బూత్ స్థాయి వరకూ ఈ కార్యక్రమాలుంటాయని పార్టీ నేతలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా వంద రూపాయల నాణెం విడుదల చేయనుంది. 2014 అక్టోబర్ 3న విజయదశమి వేళ మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైంది. స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో, నీటి సంరక్షణ, వోకల్ ఫర్ లోకల్ వంటి ఎన్నో అంశాలను ప్రధాని మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణికి ప్రకటనల రూపంలో కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చింది.