ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అమలు పరుస్తున్న పలు సంక్షేమ పథకాలలో ప్రజల ఇబ్బందులను నేరుగా వారి నుండే తెలుసుకొని, సరిదిద్దడం ద్వారా ఎన్నికలలో వారి మద్దతు కూడదీసుకొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొంత ఏడాది కాలంగా `ఇంటింటికి వైసిపి’ దగ్గర నుండి పలు కార్యక్రమాలను చేబడుతున్నారు.
తాజాగా, ప్రజలకు నేరుగా తమ సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించుకొనే విధంగా `జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మే 9న ప్రారంభిస్తున్నారు. ఈ పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైందని ముఖ్యమంత్రి తెలిపారు. స్పందనకు మరింత మెరుగైన రూపమే ఈ కార్యక్రమమని వివరించారు.
వ్యక్తిగత ఫిర్యాదుల పరిష్కారంపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. ఒకసారి ఫిర్యాదు రిజిస్టర్ చేస్తే దాన్ని అత్యంత జాగ్రత్తగా పరిష్కరించాలని, క్వాలిటీ పెంచాలని, ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యమవుతుందని జగన్ వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్ గురించి అవగాహన కల్పించాలని సూచించారు.
సిఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయం వరకూ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఉంటుందని, దీనికి సీనియర్ అధికారులు ప్రత్యేకాధికారులుగా ఉంటారని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను వారు సందర్శించి పర్యవేక్షిస్తారని తెలిపారు. 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను సందర్శించి పర్యవేక్షిస్తారని చెప్పారు.
ప్రతి కలెక్టరుకు మూడుకోట్ల రూపాయలను తక్షణ నిధులను ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. అవసరమైన చోట ఈ డబ్బును ఖర్చు చేయొచ్చని చెప్పారు. వాటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నామని చెప్పారు. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి నిధులకు ఎటువంటి లోటులేదని వివరించారు.
2022-23 సంవత్సరంలో రూ.10,203 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా బకాయిలు లేవని వివరించారు. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, దీన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలని వివరించారు.
వేయికిపైగా ఇళ్లు నిర్మిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇళ్ల లబ్ధిదారులకు పావలావడ్డీ రుణాలు ఇప్పించేలా ముమ్మర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల లబ్ధిదారులకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికి 10.03 లక్షల లబ్ధిదారులకు రూ.3,534 కోట్లకు పైగా రుణాలు మంజూరయ్యాయని తెలిపారు.
కలెక్టర్లు, బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు. ప్రతి శనివారమూ హౌసింగ్డేలా పరిగణించాలని చెప్పారు. ఎన్టిఆర్, గుంటూరు జిల్లాల్లో 48 వేలమంది పేదలకు సిఆర్డిఎ పరిధిలో మే రెండోవారంలో ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.
100 సంవత్సరాల తరువాత జగనన్న భూహక్కు, భూరక్ష పథకాన్ని చేపడుతున్నామని, రాష్ట్రంలో 17,464 గ్రామాలకు గాను మొదటి విడతలో రెండు వేల గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమం తుదిదశకు చేరుకుంటోందని ముఖ్యమంత్రి చెబుతూ మే 25 నుంచి రెండోవిడత రెండువేల గ్రామాల్లో ప్రారంభమవుతుందని తెలిపారు.
విద్యాశాఖలోని నాడు-నేడుకు సరిపడా నిధులు ఉన్నాయని, తల్లిదండ్రుల కమిటీ ఖాతాల్లో రూ.734.21 కోట్లు ఉన్నాయని తెలిపారు. తదుపరి ఖర్చుల కోసం రూ.1400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఐఎఫ్సి ప్యానెళ్లు బిగించడం ద్వారా 15,715 స్కూళ్ల్లలో చేపట్టిన మొదటి విడత నాడు-నేడు పనులు పూర్తయినట్లు అవుతుందని పేర్కొన్నారు.
దీంతో ఆరో తరగతికి సంబంధించి 30,230 తరగతి గదుల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఫేజ్-2లో 16,461 స్కూళ్ల్లలో నాడు-నేడు చేపడుతున్నామని చెప్పారు. ఫేజ్-3లో సుమారు 13 వేల స్కూళ్లలో నాడు-నేడు పనులు జరగనున్నాయని తెలిపారు. మూడు విడతల్లో 45 వేల స్కూళ్లలో పనులు పూర్తవుతాయని వివరించారు.
జూన్ 12న పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యాకానుక అందించాలని తెలిపారు. 43.10 లక్షల మందికి జగనన్న విద్యాకానుక అందుతుందని వివరించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వివరించారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కిట్లు పంపిణీ చేయాలని చెప్పారు.
మాదక ద్రవ్యాలపై పోలీస్ అధికారులు దృష్టి సారించాలని, ప్రతి కాలేజీలోనూ ఎస్ఇబి టోల్ ఫ్రీ నెంబరు డిస్ప్లే చేయాలని సూచించారు. పెద్దహోర్డింగులు పెట్టాలని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులకు అవగాహన కల్పించాలని సూచించారు.