రెజ్లర్లపై తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చేస్తున్న ఆరోపణలు వెనుక కాంగ్రెస్ పార్టీ, ఓ పారిశ్రామికవేత్త హస్తం ఉందని రెజ్లింగ్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్లూఎఫ్ఐ) అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ఆరోపించారు. తాను నిర్దోషినని, ఎలాంటి విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
అయితే తన పదవికి రాజీనామా చేయనని తేల్చి చెప్పారు. తాను నిర్దోషినని, సుప్రీంకోర్టు, ఢిల్లీ పోలీసులుపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. రెజ్లింగ్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం పెద్ద విషయం కాదని, కానీ అలాచేస్తే చేయని నేరాన్ని అంగీకరించినట్లు అవుతోందని పేర్కొన్నారు.
శనివారం కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రెజ్లర్లతో సమావేశమై మద్దతు ఇవ్వడంపై సింగ్ స్పందిస్తూ ఈ వివాదం వెనుక ఎవరు ఉన్నారనేది తెలిసిందని చెప్పారు. తనపై ఎఫ్ఐఆర్లు నమోదైనా వారింకా ఎందుకు ధర్నా చేస్తున్నారని సింగ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ, క్రీడామంత్రిత్వశాఖకు వ్యతిరేకంగా ఎందుకు నిరంతరం వ్యాఖ్యలు చేస్తున్నారని నిలదీశారు.
రెజ్లర్లు చేస్తున్న ధర్నా క్రీడాకారుల నిరసన కాదని, కుట్రదారుల నిరసన అని సింగ్ ధ్వజమెత్తారు. తాను 12 ఏళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడతున్నప్పుడు ఫెడరేషన్, ప్రభుత్వానికి ఎందుకని ఫిర్యాదు చేయలేదని విలేఖరుల సమావేశంలో సింగ్ ప్రశ్నించారు.
వారు నేరుగా జంతర్‌మంతర్‌కు వెళ్లారని అంటూ విచారణ కమిటీకి తన ఆడియో క్లిప్‌ను సమర్పించానని తెలిపారు. ఓ వ్యక్తి తనను ఇరికించేందుకు అమ్మాయిని ఏర్పాటు చేయడం గురించి అందులో ఉందని సింగ్ వెల్లడించారు. సుప్రీంకోర్టు, ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తానని, అయితే నిరసనకారులు రోజుకో కొత్త డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
తొలుత ఎఫ్ఐఆర్ కోసం డిమాండ్ చేశారని, ఎఫ్ఐఆర్లు నమోదైన తరువాత తనను జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. తాను లోక్‌సభ సభ్యుడిని అని అంటూ వినేశ్ ఫోగట్ దయతో ఎంపి కాలేదని ఎద్దేవా చేశారు. ప్రజలు తనను ఎంపిని చేశారని చెప్పారు.
మొత్తం యూపి, హర్యానా అఖాడాలు తన వెంట ఉన్నాయని పేర్కొంటూ తను నిర్దోషిని అని త్వరలో దేశం కూడా తెలుసుకుంటుందని భరోసా వ్యక్తం చేశారు. డబ్లూఎఫ్ఐ చీఫ్‌గా తన పదవీకాలం త్వరలో పూర్తయిందని, కొత్త అధ్యక్షుడి ఎన్నికతో తన పదవీ విరమణ అమలులోకి వస్తుందని చెప్పారు. ఎన్నికల పూర్తయ్యేవరకూ తాత్కాలిక చైర్మన్‌గా ఉన్నట్లు తెలిపారు. డబ్లూఎఫ్ఐ చీఫ్‌గా 12ఏళ్లు పూర్తిచేసుకున్న సింగ్ మరోసారి పోటీచేసేందుకు అనర్హులు.