సామాన్యుల సమస్యల పరిష్కారానికి, ప్రజలతో అనుబంధానికి మన్ కీ బాత్ కార్యక్రమం వేదికైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వందో మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ఆదివారం ప్రసంగిస్తూ ప్రజల నుంచి తనకు వేల సంఖ్యలో లేఖలు, సందేశాలు వచ్చాయని, వాటిని చదువుతున్నప్పుడు భావోద్వేగాలకు లోనయ్యానని చెప్పారు.
ఈ కార్యక్రమం వల్ల తాను అసామన్య సేవలు అందించిన పలువురు గురించి తెలుసుకున్నట్లుగా ప్రధాని తెలిపారు. సమాజంలో ఎన్నో మార్పులకు మన్ కీ బాత్ శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. మన్‌కీ బాత్ మొదటిసారి 2014, అక్టోబర్ 3న ప్రారంభమైందని, ‘మన్‌కీ బాత్’ కోట్లాది మంది ప్రజల ‘మన్ కీ బాత్’ కి ప్రతిబింబమని చెప్పారు.
ఈ కార్యక్రమానికి భారీ విజయాన్ని అందించనందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రధాని మోదీ ప్రారంభ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ వంటి అనేక ప్రజా ఉద్యమాలను ఊపందుకునేలా చేసిందని గుర్తు చేశారు. ఆత్మ నిర్భర భారత్‌ను ప్రోత్సహించడంతో పాటు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో పాటు విభిన్న రంగాల్లో ప్రతిభావంతులైన వ్యక్తుల కథలను అందరికీ అందించిందని ప్రధాని వివరించారు.
ఇది ప్రజలతో కనెక్ట్ అయ్యేలా చేసిందని చెబుతూ ఇది ఓ కార్యక్రమం కాదని, ఆధ్యాత్మిక ప్రయాణమని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చర్చించామని, సమాజంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు.
ఈ సందర్భంగా మణిపూర్ కు చెందిన విజయశాంతిదేవితో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు. మహిళల సాధికారత కోసం పనిచేస్తున్నారు విజయశాంతి. తన ఉత్పత్తులకు మంచి డిమాండ్ వస్తుందని, ఇంతర దేశాల నుండి కూడా ఆర్డర్స్ వస్తున్నాయని విజయశాంతి తెలిపింది. అలాగే విశాఖకు చెందిన వెంకట ప్రసాద్ గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. భారతీయ వస్తువులే ప్రసాద్ ఎక్కువ ఉపయోగిస్తారని ప్రధాని అభినందించారు.
ఈ 100 ఎపిసోడ్ ద్వారా గత స్మృతులను మోడీ గుర్తుచేసుకున్నారు. సీఎంగా ఉన్నప్పుడు తాను నిత్యం ప్రజలను కలిసేవాడినన్న ప్రధాని ఢిల్లీ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. తనకు చాలాసార్లు ఒంటరినని అనిపించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో దగ్గరగా ఉన్న అనుభూతి తనకు కలుగుతుందని చెప్పారు. ‘సెల్ఫీ విత్ డాటర్’ ప్రచారం తనని చాలా ప్రభావితం చేసిందని ప్రధాని తెలిపారు. ఈ ఎపిసోడ్లో దాని గురించి ప్రస్తావించారు.
1 Comment
Nice