కర్ణాటకలో రాజకీయ అస్థిరతకు రాజవంశ కాంగ్రెస్, జేడీ(ఎస్) ముఖ్యకారణమని, ఈ రెండు పార్టీలు కర్ణాటకను ఓ ఎటిఎంగా చూశాయని, అస్థిర ప్రభుత్వాలు దోపిడీకి అవకాశం కల్పిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆదివారం కర్ణాటకలోని కోలారు. చెన్నపట్టణ, హాసన్ జిల్లాలోని బేలూరులో, మైసూరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలలో ప్రధాని పాల్గొన్నారు.
రామనగర జిల్లా చన్నపట్నలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ జిల్లా జెడి(ఎస్)కు కంచుకోట వంటిది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచే జేడీ(ఎస్) అధినేత హెచ్.డి. కుమారస్వామి బీజేపీ అభ్యర్థి సిపి యోగేశ్వరపై గెలుపొందారు. ఆయన తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరారు.
కాంగ్రెస్, జెడీ(ఎస్)లపై దాడి చేస్తూ మోదీ సుదీర్ఘకాలం పాటు కర్ణాటక అస్థిర ప్రభుత్వ డ్రామాను చూసిందని, ఎప్పుడూ ఆ పార్టీలు దోపిడీ కోసమే పోరాటం సాగిస్తాయి తప్ప అభివృద్ధి కోసం కాదని ఎద్దేవా చేశారు. 224 స్థానాలున్న అసెంబ్లీలో 15 నుంచి 20 వరకు సీట్లు వస్తే కింగ్‌మేకర్ అవుతామని జేడీ(ఎస్ )బహిరంగంగా ప్రకటించిందని గుర్తు చేశారు.
ఈ స్వార్థ పరమైన చొరవ ఒక కుటుంబానికే ప్రయోజనం చేకూరి, లక్షలాది కుటుంబాలకు నష్టం కలిగిస్తుందని ప్రధాని విమర్శించారు. కర్ణాటక అభివృద్ది కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జేడీఎస్ తో జతకట్టి 85 శాతం కమీషన్ పాలన అందిస్తుందని, కేంద్రం ఇచ్చే నిధుల్లో ప్రజలకు 15 శాతమే అందుతుందని ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం గతంలో కర్ణాటకకు ఒక్క రూపాయి నిధులు మంజూరు చేస్తే అందులో కాంగ్రెస్ ప్రభుత్వం 85 పైసలు మింగేసి మిగిలిన 15 పైసలు మాత్రమే ప్రజల చేతిలో పెట్టిందని ప్రధాని ధ్వజమెత్తారు. కర్ణాటకలో మళ్లీ ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కోరుకుంటున్నారా ? అంటూ ప్రధాని ప్రజలను ప్రశ్నించారు.
తమది డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటూ, కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్ ది ఔట్ డేటెడ్ అయిన ఇంజన్, అలాంటి డొకోటా ఇంజన్ తో లక్షం చేరుకోవాలని మనం అనుకోవడం పొరపాటు అవుతుందని హెచ్చరించారు. అలాంటి పనికి రాని ఇంజన్ ను షెడ్ కే పరిమితం చెయ్యాలని ప్రధాని మోదీ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యకూడదని, బీజేపీకి ఓటు వేసి ఆదరించాలని ప్రధాని ప్రతి బహిరంగ సభలో ప్రజలకు మనవి చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలది విచిత్రమైన అనుభందం అని, ఆరెండు పార్టీలు కలిసి ప్రజలు నిలువుదోపిడీ చెయ్యడానికి ఎప్పటికప్పుడు ప్లాన్ వేస్తుంటాయని ప్రధాని ఎద్దేవా చేశారు.
హాసన్ జిల్లా జేడీఎస్ కు కంచుకోట అని దళపతులు భ్రమపడుతున్నారని, కాని మేము (బీజేపీ) ఇదే చోట పాగా వేస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో, కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంటే భారీ మొత్తంలో పెట్డుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు వస్తారని, బీజేపీకి మీరు ఓటు వేసి గెలిపించాలని ప్రధాని మోదీ కన్నడిగులకు మనవి చేశారు.