మే10న జరగనున్న కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను బెంగుళూరులో సోమవారం విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో 16 ముఖ్యమైన హామీలను బీజేపీ పొందుపరిచింది.
రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేస్తామని ప్రకటించింది. 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను అందిస్తామని బీజేపీ తెలిపింది. పోషణే స్కీమ్ ద్వారా పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి రోజూ అర లీటర్ నందినీ పాలను రోజూ ఇస్తారు. అలాగే శ్రీ అన్న – శ్రీ ధాన్య కింద నెలవారీ రేషన్ కిట్ లో 5 కేజీల బియ్యం ఇస్తారు.
మైసూర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే అతిపెద్ద పునీత్ రాజ్‌కుమార్ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. విశ్వేశ్వరయ్య విద్యా యోజన కింద ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తామని వెల్లడించింది.
వచ్చే ఐదేళ్లలో 200 చేపల పెంపకం ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేస్తామని తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రతి మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రతి వార్డులో ‘అటల్ ఆహార కేంద్రాన్ని’ ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తదితరులు పాల్గొన్నారు. కాగా 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 3,632 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, బీజేపీ నుంచి 707 మంది, కాంగ్రెస్ నుంచి 651 మంది, స్వతంత్ర అభ్యర్థులుగా 1,720 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.