మాజీ ప్రధాని, బిజెపి వ్యవస్థాపక అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపి) ఓ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.
“భారతదేశాన్ని నిరంతరం ఫస్ట్ ప్లేస్లో ఉంచేందుకు కృషి చేస్తున్న పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక సూక్ష్మ విరాళాల కార్యక్రమాన్ని ప్రారంభించాం” అని పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు.
“మీరు అందించే చిన్న మొత్తాలే.. రేపటి దేశ భవిష్యత్తుకు పెద్ద బలాన్ని అందిస్తాయి” అని నడ్డా ట్విట్టర్ ద్వారా తెలిపారు. “ఈ రోజు డిసెంబర్ 25, అటల్ జీ జన్మదినం నుంచి ఫిబ్రవరి 11 వరకు అంటే దీన్ దయాళ్ జీ పుణ్య తిథి వరకు, బీజేపీ ప్రత్యేక సూక్ష్మ విరాళాల కార్యక్రమం జరగనుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి మద్దతు అందించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం కావడానికి దోహదపడాలని విజ్ఞప్తి చేసారు. దీంతో దేశాన్ని ఎల్లప్పుడూ అత్యుత్తముగా ఉంచడంలో బీజేపీ కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
పార్టీ సూక్ష్మ విరాళాల కార్యక్రమానికి తనవంతుగా సహకారాన్ని అందిస్తూ.. నడ్డా ఇలా అన్నారు, “Namo యాప్ ద్వారా ‘డొనేషన్’ మాడ్యూల్ని ఉపయోగించి బిజెపిని బలోపేతం చేయడానికి నా సొంత విరాళాన్ని అందించాను. రిఫరల్ కోడ్ని ఉపయోగించి మీరు కూడా దీనికి విరాళాలు ఇవ్వవచ్చు” అని చెప్పారు.
ఈ సామూహిక ఉద్యమంలో మీతో పాటు మీ స్నేహితులు, కుటుంభం సభ్యులు ద్వారా విరాళాలు అందించి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి బీజేపీకి సహకారం అందించాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.
ప్రధాని రూ 1,000 విరాళం
కాగా, భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 1,000 రూపాయల విరాళం అందించారు. పార్టీకి విరాళం ఇచ్చిన ‘పే స్లిప్’ను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. బీజేపీకి విరాళం ఇచ్చి, పార్టీని మరితం బలోపేతం చేయాలని, అలాగే దేశాన్ని బలోపేతం చేసేందుకు సహకరించాలని ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు.
పార్టీ నిధి కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు మోదీ పేర్కొన్నారు. ‘‘భారతీయ జనతా పార్టీకి పార్టీ నిధి కోసం 1,000 రూపాయలు విరాళం అందించాను. ఎల్లప్పుడూ దేశానికి మొదటి స్థానం ఇవ్వాలనే మా ఆదర్శం” అని తెలిపారు.
” మీ చిన్న విరాళం ద్వారా జీవితాంతం నిస్వార్థ సేవ చేసే సంస్కృతి గల మా కేడర్ మరింత బలోపేతం అవుతుంది. బీజేపీని మరింత బలోపేతం చేయడంలో సహకరించండి. అలాగే దేశాన్ని మరింత బలోపేతం చేయడానికి కూడా సహకరించండి’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.