సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చీర్లవంచ గ్రామంలో పర్యటించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మిడ్ మానేరు బాధితులను కలిసి సంఘీభావం తెలిపారు. మిడ్ మానేరు ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి 17 ఏళ్లు అయినా వారి సమస్యలు పరిష్కారం కాకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
మిడ్ మానేరు బాధితులకు సాయం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి 8 ఏండ్లు అయ్యిందని, బాధితులకు ఇంటికి రూ. 5లక్షలిస్తానని మాట ఇచ్చి తప్పిండని ధ్వజమెత్తారు. గతంలో తాను ఇక్కడికి వచ్చి డబుల్ బెడ్రూం రాని వాళ్ల లిస్ట్ పంపండి. కేంద్రంతో మాట్లాడి శాంక్షన్ చేయిస్తానని, ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపితే కేంద్రంతో మాట్లాడి మంజూరు చేయిస్తానని చెప్పానని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు ఆ ప్రతిపాదనలే ఇవ్వలేదని విమర్శించారు.
ఈ ప్రభుత్వం కొనసాగేది 5 నెలలే అంటూ మీరు గెలిపించిన ఎమ్మెల్యే జర్మనీకి వెళ్లిపాయే, కొదురుపాక కేసీఆర్ అత్తగారి ప్రాంతమని, మోసం చేయడని నమ్మి ఓట్లేసి సీఎంను చేస్తే మిమ్ముల్ని నిండా ముంచిండని విమర్శించారు. మళ్లీ ఎన్నికలొస్తున్నాయని అంటూ మళ్లీ వచ్చి మిమ్ముల్ని మోసం చేసేందుకు జిమ్మిక్కులు చేసేందుకు సిద్ధమైతున్నరని సంజయ్ హెచ్చరించారు.
వారివన్నీ న్యాయబద్దమైన డిమాండ్లే అంటూ వారి పోరాటానికి మద్దతు ప్రకటించారు. వారి డిమాండ్లను పరిష్కరించే వరకు వారితో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వేములవాడ నియోజకవర్గంలోని రుద్రవరంలో మిడ్ మానేరు బాధితుల ఐక్య వేదిక నాయకులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. బీజేపీ నాయకులు ఎర్రం మహేశ్, ఐక్యవేదిక నాయకులు పిల్లి కనకయ్య, లింగస్వామి, ఎంపీటీసీ సంకె శేఖర్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మిడ్ మానేరు బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఐక్య వేదిక నాయకులు ఏకరవు పెట్టారు. తమ కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీనికి నిరసనగా ఈనెల 8, 9 తేదీల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ముంపు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షలిస్తామనే హామీనీ చేర్చాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు