మణిపుర్లో హింసాకాండతో అట్టుడుకుతోంది. నిరసనకారులు వాహనాలను, ప్రార్థనా స్థలాలను తగులబెడుతున్నారు. ఘర్షణలను నియంత్రించేందుకు సైన్యం, అస్సాం రైఫిల్ బలగాలు రంగంలోకి దిగాయి. సైన్యం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది.
మెజారిటీ మైతై కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)లో చేర్చే చర్యలను వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఈ హింసాకాండ చోటుచేసుకుంది. మణిపుర్‌లోని ఇంఫాల్, చురాచాంద్‌పుర్, కాంగ్‌పోక్సిలో ఘర్షణలు జరుగడంతో ఎనిమిది జిల్లాల్లో కర్ఫూ విధించారు.
ఇంటర్నెట్ను నిలిపేశారు. సైనిక శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో 4000 మంది ప్రజలకు ఆశ్రయం కల్పించారు. ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ ‘మా రాష్ట్రం మండిపోతోంది, సాయం చేయండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు ట్వీట్ చేసి అభ్యర్థించారు.
కాగా అమిత్ షా, మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌లో మాట్లాడారు. మణిపుర్లో పరిస్థితిని కేంద్రం సునిశితంగా గమనిస్తోంది. మణిపుర్లో ప్రస్తుతం గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణ జరుగుతోంది. మణిపుర్ జనాభాలో 53 శాతం మంది మైతై వర్గానికి చెందినవారే. ఆ రాష్ట్రంలో వారి ప్రాబల్యం ఎక్కువ.
బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం మణిపుర్ పర్వత ప్రాంతాల్లో నివసించేందుకు మైఐ వర్గానికి అనుమతి లేదు. మణిపుర్‌లోని చురాచాంద్‌పుర్ ఇప్పుడు ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. దహనకాండ, హింసాకాండతో మణిపుర్ అట్టుడిగిపోతోంది.