నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజీనామాపై వెనక్కి తగ్గారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల కమిటీ తీర్మానం మేరకు ఆయన వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.
మద్దతుదారులు, ఓటర్లు చాలా సంవత్సరాలుగా తనవెంట ఉన్నారని, వారి మనోభావాలను విరుద్ధంగా వ్యవహరించలేనని చెప్పారు. తనపై ఉన్న ప్రేమ, నమ్మకానికి తాను కదిలిపోయానని, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
భవిష్యత్తులో తాను పార్టీలో సంస్థాగత మార్పులు, కొత్త బాధ్యతలు అప్పగించడం, కొత్త నాయకత్వాన్ని సృష్టించడంపై దృష్టి సారిస్తానని పవార్ తెలిపారు. పార్టీ అభివృద్ధి, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తాను తీవ్రంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు, నేతలకు తాను ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానని పవార్ పేర్కొన్నారు.
శరద్ పవార్ ఇటీవల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కమిటీని వేశారు. సమీప భవిష్యత్లో కొత్త తరం విజయవంతం అయ్యేందుకు పార్టీకి సంస్థాగత మార్పులను సూచించారు. ఈ క్రమంలోనే శుక్రవారం కమిటీ సమావేశమైంది.
ఈ సందర్భంగా రాజీనామాను తిరస్కరించడంతో పాటు పార్టీ మనోభావాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ముంబయిలోని వైబీ చవాన్ సెంటర్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. కమిటీ సమావేశం ఓవైపు జరుగుతుండగానే మరో వైపు కార్యకర్తలు రాజీనామాను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.