కర్ణాటక ఎన్నికల ప్రచారం గడువు సోమవారం ముగుస్తుండగా, బెంగుళూరులో వరుసగా రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ మరో భారీ రోడ్‌షో నిర్వహించారు. శనివారం నగరంలో సుమారు 26 కి.మీ మేర రోడ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదివారం మరో 10 కి.మీ మేర రోడ్ షో కొనసాగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ ) పరీక్ష దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రోడ్‌షోను కుదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు న్యూ తిప్పసాంద్ర రోడ్ లోని కెంపేగౌడ విగ్రహం నుంచి రోడ్ షో ప్రారంభమైంది.
కెంపేగౌడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సెంట్రల్ బెంగళూర్ 5 నియోజకవర్గాలను టచ్ చేస్తూ ప్రధాని రోడ్ షో కొనసాగుతోంది. ప్రధాని వెంట కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బెంగళూరు సెంట్రల్ ఎంపి పీసీ మోహన్‌లు ఉన్నారు.
ప్రజలు రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో మోదీకి స్వాగతం పలికారు. మోదీ…మోదీ నినాదాలు హోరెత్తాయి. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ఉత్సాహంగా రోడ్‌షోలో పాల్గొన్నారు. తిప్పసండ్ర రోడ్డులోని కెంపెగౌడ విగ్రం నుంచి ప్రారంభమైన రోడ్‌షో ట్రినిటీ రోడ్ వద్ద ముగిసింది. గంటన్నర వ్యవధిలో 8 కిలోమీటర్ల మేరకు రోడ్‌షో జరిగింది.
రోడ్లపైన, భవనాలపైన పెద్దసంఖ్యలో గుమిగూడిన ప్రజానీకానికి మోదీ అభివాదం చేయడంతో, అందుకు ప్రతిగా వారు…మోదీ మోదీ, భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు. పలు ప్రాంతాల్లో వాయిద్యాలు మోగిస్తూ పండుగ వాతావరణం కనిపించింది.
మెల్లగా ప్రయాణిస్తూ ముందుకు సాగిన మోదీపైన, ఆయన వాహన శ్రేణిపైన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పుష్పవర్షం కురిపించారు. ట్రినిటీ సర్కిల్‌కు రోడ్‌షో చేరుకోగానే మోదీ ముకుళిత హస్తాలతో ప్రజలకు అభివాదం చేశారు. మోదీ రోడ్‌షో సందర్భంగా పలు చోట్లు బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు జరిగాయి.
ఆదివారం రోడ్ షో ముగిసిన అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగింఛారు. మే 10న కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.