కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై భారత ఎన్నికల సంఘానికి భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది. “కర్ణాటక సార్వభౌమత్వం” అంటూ సోనియా మాట్లాడటం పట్ల ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈనెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా సార్వభౌమత్వం అని ఓ సభలో సోనియా గాంధీ అనడం రాజకీయ దుమారాన్ని రేపింది.
దేశం నుంచి కర్ణాటకను విభజించాలని కాంగ్రెస్ భావిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఆదివారం ఆరోపించారు. సోమవారం ఇదే అంశంపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. సార్వభౌమత్వం వాఖ్య చేసిన సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.
“కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమత్వం, సమగ్రతకు ముప్పు కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎవరినీ అనుమతించదు” అని సభలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను మే 6న కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది. దీంట్లో సార్వభౌమత్వం అనే మాట దుమారాన్ని రేపుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడే దేశం మొత్తానికి సార్వభౌమత్వం వచ్చిందని, కర్ణాటకకు సొంతంగా సార్వభౌమత్వం ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. దేశం నుంచి కర్ణాటకను విడదీయాలని కాంగ్రెస్ భావిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
“సార్వభౌమత్వం అనే పదాన్ని ఆమె (సోనియా గాంధీ) కావాలనే వాడారు. ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్ అజెండాతోనే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది. అందుకే అలాంటి పదాలు వాడుతున్నారు. ఈ దేశ వ్యతిరేక చర్య పట్ల ఈసీ చర్యలు తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం” అని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు.
సుమారు నాలుగేళ్ల తర్వాత ఓ ఎన్నికల సభలో సోనియా గాంధీ పాల్గొన్నారు. గత శనివారం హుబ్లీ జిల్లాలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. కర్ణాటక ఎన్నికల తుది దశ ప్రచారంలో ఆమె పాల్గొనడం చాలా మందిని ఆశ్చర్యానికి లోను చేసింది.
అబద్ధాలు పనిచేయడం లేదు కాబట్టే ఆఖరు నిమిషంలో సీనియర్ నేత (సోనియా గాంధీ)ని కాంగ్రెస్ ప్రచారానికి తీసుకొచ్చిందని మోదీ కూడా ఈ విషయంపై విమర్శలు సంధించారు. భారత సార్వభౌమత్వాన్ని కించపరిచేలా కాంగ్రెస్ చర్యలు ఉంటున్నాయని ఆయన విమర్శించారు. కర్ణాటకను భారత్ నుంచి వేరు చేయాలని కాంగ్రెస్ అనుకుంటోందని ఆరోపించారు.