తమ రాష్ట్రంలో “ది కేరళ స్టోరీ” సినిమాపై నిషేధం విధిస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఈ సినిమా దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో విద్వేషపూరిత, హింసాత్మక ఘటనలను నివారించేందుకు, శాంతిని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం” అని ఆమె చెప్పారు.
కేరళ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి సిరియాలో ఐసిస్ ఉగ్రవాద గ్రూపుల్లో చేర్పించే ఇతివృత్తంతో ఈ సినిమాను నిర్మించారు. మే 5న ఈ చిత్రం విడుదల కాగా దేశవ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టుకొంటుంది. తమిళనాడులోని థియేటర్ల నుంచి ఈ సినిమాను ఇప్పటికే తొలగించారు. ఈ చిత్రాన్ని నిషేధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన తొలి రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది.
అయితే మమత నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని నిర్మాత విపుల్ అమృత్లాల్ షా తెలిపారు. నిజమైన ఘటనల ఆధారంగా సినిమా తీశామని ఆయన చెప్పారు. అదే సమయంలో తమిళనాడులో సినిమాను బ్యాన్ చేయాంటూ ఎన్టీకే పార్టీ అధినేత సీమన్ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తూ సినిమాను అడ్డుకోవడాన్ని విపుల్ షా తప్పుబట్టారు. ఒక్క వ్యక్తి బెదిరిస్తే సినిమా ప్రదర్శనను ఆపివేస్తారా? అని తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలను ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానాలు కూడా సినిమాను నిషేధించలేదని ఆయన గుర్తు చేశారు.
మరో వైపు ది కేరళ స్టోరీ సినిమా రికార్డ్ కలెక్షన్లు సాధిస్తోందని బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. విడుదలైన మూడు రోజుల్లోనే 35 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు ఇప్పటికే వచ్చాయన్నారు. అదా శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా కాంగ్రెస్ కూడా ది కేరళ స్టోరీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ ఈ చిత్రానికి మద్దతు తెలుపుతోంది. ది కేరళ స్టోరీ సినిమాను పశ్చిమ బెంగాల్ నిషేధించడం పొరపాటని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. మరోవైపు మధ్యప్రదేశ్లో ఈ సినిమాకు వినోదపన్నును ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మినహాయించారు.