హిందూ దేవతల పట్ల అవమానకరంగా వాఖ్యలు చేస్తున్న వివాదాస్పద కమెడియన్ మునావర్ ఫారూఖీని కేటీఆర్ తెలంగాణకు ఆహ్వానించడంతో వివాదం చెలరేగుతుంది.
కేటీఆర్ తీరు పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గమ్మ వారిని, సీతమ్మ వారిని, శ్రీరామ చంద్రుడిని అవమానించిన మూర్ఖుడిని కేటీఆర్ రాష్ట్రానికి ఆహ్వానించడం దారుణం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.
కామెడీ షోలను సీరియస్‌గా ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదనీ, రాజకీయ కారణాల వల్ల తాము మునావర్ షో వంటివి క్యాన్సిల్ చేయలేమని అంటూ మంత్రి కెటి రామారావు ఓ కార్యక్రమంలో చేసిన వాఖ్య కలకలం రేపుతున్నది.
తాము ప్రభుత్వంపై ఎవరు చేసే విమర్శలనైనా స్వాగతిస్తామని, ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌కు రావాలనీ తమది అచ్చమైన కాస్మొపాలిటన్ సిటీ అని స్పష్టం చేశారు. దీంతో బెంగళూరులో నిరసనల నేపథ్యంలో రద్దయిన మునావర్ సిటీలో షో నిర్వహించడానికి సిద్ధమయ్యాడు.
గుజరాత్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ దేశంలోనే అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చిన అత్యంత వివాదాస్పద స్టాండప్ ఆర్టిస్ట్. హాస్య ప్రదర్శనల్లో మునావర్ ఎంచుకునే అంశాలన్నీ రాజకీయ సమకాలీన అంశాల చుట్టే ఉంటాయి.
గుజరాత్ అల్లర్ల సమయంలో తన కుటుంబం పడిన ఇబ్బందుల్ని కూడా కామెడీగా మార్చి బీజేపీపై సెటైర్లు వేస్తాడితడు. గతంలో ఎన్ఆర్సీ, ఢిల్లీ గొడవలపై ఆయన చేసిన కామెడీ సాంగ్ కూడా వివాదాస్పదమైంది.
మునావర్ గతంలో కూడా హైదరాబాద్ కు వచ్చాడు. చివరి సారిగా గత డిసెంబర్ 20న మునావర్ నగరంలో షో నిర్వహించాడు. ఆ తర్వాత ఇండోర్‌లో షో నిర్వహించిన మునావర్ అక్కడ అరెస్ట్ అయి నెల రోజులు జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత అతను మరింత వివాదాస్పద సెలెబ్రిటీ అయ్యాడు.
తాజాగా బెంగళూరు షో క్యాన్సిల్ అయిన తర్వాత తీవ్ర నిర్వేదానికి లోనైన మునావర్ ఇక తాను స్టాండప్ కామెడీకి గుడ్ బై చెప్తున్నా అని ప్రకటించాడు. అయితే కేటీఆర్ ప్రకటనతో తిరిగి హైదరాబాద్ లో షో నిర్వహణకు ముందుకొచ్చాడు. గడిచిన 2 నెలల్లో 12 కామెడీ షోలు రద్దయ్యాయి.
రాజాసింగ్ హెచ్చరిక
గుజరాత్లో పొమ్మంటే మునావర్ ఇక్కడకి వస్తున్నాడని అంటూ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మంచి వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే తాము అతడిని తరిమికొట్టడానికైనా సిద్ధం అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
హిందూ దేవుళ్ళను కించపరుస్తూ కామెడీలు చేసే మునావర్ ఫారుఖీనీ 16 రాష్ట్రాలు నిషేధించాయని, అలాంటి వ్యక్తిని తెలంగాణకు వచ్చి..కామెడీ షో చేయాలని కేటీఆర్ ఆహ్వానిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచిన మునావర్ ఫారుఖీని ఎందుకు ఆహ్వానించారో చెప్పాలని కేటీఆర్ ను ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని ఏలుతున్న భయంకరమైన హిందువుగా చెప్పుకునే కేసీఆర్.. తొలుత నాస్తికుడైన కొడుకు కేటీఆర్ ను కట్టడి చేయాలని బండి సంజయ్ ముఖ్యమంత్రికి హితవు చెప్పారు.
కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రులంతా నాస్తికులే అని సంజయ్ మండిపడ్డారు. మునావర్ ఫారూఖీ వంటి మూర్ఖులకు తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని స్పష్టం చేశారు. యువ మోర్చా నేతలు అలాంటి మూర్ఖుడు తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకోవాలని పిలుపిచ్చారు.