2024 లోక్ సభ ఎన్నికలకు ఒక ఏడాది ముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపిల మధ్య జరిగిన హోరాహోరీ పోరాటంలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో ఘన విజయం సాధించింది. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో 136 స్థానాల్లో గెలుపొందింది. భారీ విజయంతో ఆ పార్టీ సంబురాల్లో మునిగిపోయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీకి ఈ స్థాయిలో మెజార్టీ దక్కడం 34 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం చెప్పుకోదగ్గ అంశం. 1989లో కాంగ్రెస్ ఏకంగా 178 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ తర్వాత 1994లో జనతాదళ్‌కు 115 స్థానాలు దక్కాయి. మళ్లీ 1999లో కాంగ్రెస్ 132 సీట్లు గెలుచుకోగా.. 2004, 2008 ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. 2013లో కాంగ్రెస్ 122 స్థానాలు దక్కించుకోగా.. 2018 ఎన్నికల్లో మళ్లీ హంగ్ వచ్చింది.
మరో వైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కొత్త ముఖ్యమంత్రి ఈ నెల 15న ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది. కంఠీరవ స్టేడియంలో సీఎం ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తున్నది. అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 65 సీట్లకు పరిమితం కావలసి వచ్చింది. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మరోసారి కింగ్ మేకర్ కావలనుకున్న జేడీఎస్ అధినేత హెచ్ డి కుమారస్వామి కేవలం 19 సీట్లతో నిరాశకు గురి కావలసి వచ్చింది.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ కు అభినందనలు తెలిపారు. కర్ణాటకలో ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని ఆశిస్తున్నానని ట్విట్ చేశారు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కార్యకర్తల కృషిని ప్రధాని అభినందించారు.
బెంగళూరులోని హిల్టన్ హోటల్ లో ఆదివారం మధ్యాహ్నం 12.30గంటలకు సీఎల్పీ భేటీ కానుంది. ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్ధరామయ్య పోటీపడుతున్నారు.
బిజెపి నేత, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గెలిచినా పలువురు మంత్రులు ఓటమి చెందారు. ఎన్నికల్లో ఓడిన వారిలో బీసీ పాటిల్, గోవింద కారజోల, డా. కె సుధాకర్, ఎంటిబి నాగరాజు, బి. శ్రీరాములు, నారాయణ గౌడ్, మురుగేష్ నిరాణి సహా పలువురు మంత్రులు ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరీ కూడా ఓడిపోయారు.
మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ 25వ తేదీన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆ పార్టీ మొత్తం 47 స్థానాల్లో పోటీ చేసింది. కొప్పాల్ జిల్లా గంగావతి నుంచి పోటీ చేసి ఆయన ఒక్కరే ఆ పార్టీ తరపున గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అన్సారిపై గాలి గెలిచారు. గంగావతిలో బీజేపీ మూడవ స్థానంలో నిలిచింది. బల్లారి సిటీ నుంచి పోటీ చేసిన గాలి జనార్ధన్ రెడ్డి భార్య అరుణ లక్ష్మి ఓడిపోయారు.