లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు వారాలుగా నిరసన తెలుపుతున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లు తన నిరసనకు మద్దతు తెలుపవలసినదిగా బిజెపి మహిళా నేతలను అభ్యర్ధించారు. ఇప్పటివరకు అధికార బీజేపీకి చెందిన ఏ నాయకుడు కూడా భారత రెజ్లర్లకు మద్దతుగా ముందుకు రాలేదు.
సోమవారం నుంచి బీజేపీకి చెందిన మహిళా ఎంపీలందరికీ రెజ్లర్లకు మద్దతు తెలియజేయాలని లేఖలు రాస్తామని వినేశ్ పోగట్ తెలిపారు. దేశంలోని మహిళల భద్రత గురించి వారు మాట్లాడుతూ తాము కూడా వారి బిడ్డలమే అని పేర్కొంటూ బీజేపీలోని మహిళా లీడర్లు, కేంద్ర ప్రభుత్వంలోని మహిళా ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి తమకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.
తాము వారికి (అధికార పార్టీ మహిళా పార్లమెంటేరియన్లు) బహిరంగ లేఖ రాస్తున్నామని చెబుతూ తమ తోటి రెజ్లర్లు ఆ లేఖలను చేతితో అందజేస్తారని ఆమె తెలిపారు. ఇ-మెయిల్ ద్వారా కూడా లేఖలు పంపిస్తామని చెప్పారు. ఇన్ని రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నా తమ వాయిస్, తమ మనోవేదన ఇంకా వారికి చేరలేదని అనుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ లేఖలు అందుకున్న తర్వాత వారు వచ్చి మద్దతు ఇస్తారని భావిస్తున్నాం అని వినేష్ చెప్పారు.
బీజేపీ ఎంపీ, నిందితుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌ని అరెస్టు చేయకపోవడాన్ని వారు నిరసిస్తూ పలు రకాల ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా, ఆదివారం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిపాలనను రద్దు చేసి, భారత ఒలింపిక్ సంఘం స్వాధీనం చేసుకుంది. ఇది తమకు న్యాయం చేయడానికి మొదటి అడుగు అని భారత రెజ్లర్లు హర్షం ప్రకటించారు.
లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని క్రీడాకారులు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, భారతదేశపు అత్యుత్తమ రెజ్లర్లలో అనేక మంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ కేసుకు సంబంధించి బ్రిజ్ భూషణ్, డబ్ల్యుఎఫ్ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌పై ఒక మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఛేదించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు రెండుసార్లు ప్రశ్నించారు. మైనర్ రెజ్లర్ యొక్క స్టేట్మెంట్ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 ప్రకారం రికార్డ్ చేశారు.