కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై తేల్చేందుకు మాత్రం కాంగ్రెస్ తర్జనభర్జనలు పడుతోంది. ఆదివారం సాయంత్రం బెంగళూరులోని ఓ హోటల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, డీకే శివకుమార్, సిద్దరామయ్య, తదితర కీలక నేతలతో సీఎల్పీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రధానంగా ఈ పోటీ ఆశిస్తున్న శివకుమార్, సిద్దరామయ్యలను ఢిల్లీకి పిలిపించారు. సోమవారం ఈ విషయమై ఢిల్లీలో సంప్రదింపులు జరుగుతున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎంను ఎంపిక చేసే నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకే వదిలేయాలని సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. సమావేశానికి ముందు, సీఎల్పీ తన నివేదికను పార్టీ హైకమాండ్‌కు పంపుతుందని, ఇది తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రి పేరును నిర్ణయించడానికి సమయం తీసుకుంటుందని మల్లిఖార్జున్ ఖర్గే చెప్పారు.
కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రేసులో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ఎవరనేది తేల్చేందుకు సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మల్లిఖార్జున్ ఖర్గేకే ఈ విషయంపై తేల్చేందుకు బాధ్యతలు అప్పగించింది సీఎల్పీ.
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్ బవరియ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి భన్వర్ జితేంద్ర సింగ్‌లు ఏఐసీసీ పరిశీలకులుగా పాల్గొన్నారు. మరోవైపు, సీఎల్పీ సమావేశం జరుగుతున్న హోటల్ ముందు ఇటు డీకే శివకుమార్, అటు సిద్దరామయ్య మద్దతుదారులు భారీగా చేరుకుని వారికి మద్దతుగా నినాదాలు చేశారు. ఇక సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో పాటు ఎంబీ పాటిల్, జీ పరమేశ్వర వంటి పలువురు పోటీ పడుతున్నారని కర్నాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామలింగా రెడ్డి తెలిపారు.
ఎవరిని సీఎం చేయాలనేది సీఎల్పీ భేటీలో కొలిక్కి రాలేదు. సిద్దరామయ్య, డీకే పట్టువీడకపోవడంతో ఏకాభిప్రాయం సాధ్యం కాదని ఏఐసీసీ పరిశీలకులు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. సీఎల్పీ భేటీలోనే ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవాలని సిద్దరామయ్య పట్టుబట్టగా, అధిష్ఠానం నిర్ణయం కూడా తీసుకోవాలని డీకే పేర్కొనడంతో అంశం ఢిల్లీకి చేరింది.
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సూచించే వారే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్నారు. సోనియాగాంధీతోపాటు మల్లికార్జున ఖర్గే కూడా డీకే శివకుమార్‌వైపు మొగ్గు చూపుతారనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే, రాహుల్‌గాంధీ సిద్దరామయ్య పట్ల సానుకూలంగా ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.